Hyderabad | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘మన నగరానికి, మన రాష్ర్టానికి మూడు వైపులా సముద్రం ఉన్నది. బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రం, హిందూ మహా సముద్రం’.. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణ రాష్ర్టానికే తీరప్రాంతం లేదని స్కూల్‌కు వెళ్లే పిల్లలను అడిగినా చెప్తారు. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం ఏకంగా హైదరాబాద్ చుట్టూ మూడు సముద్రాలను తీసుకొచ్చేశారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలో నేవీ రాడార్ స్టేషన్ ప్రాజెక్టు పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టూ, తెలంగాణ చుట్టూ మూడు సముద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో సీఎం వ్యాఖ్యలపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.
నేను హైదరాబాద్‌లో సముద్రాన్ని చూడటానికి వెళ్తున్నాను. ఎవరైనా వస్తారా? అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు హుస్సేన్‌సాగర్ దగ్గర దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తూ సముద్రాన్ని చూస్తున్నానంటూ జోకులు వేస్తున్నారు. గతంలో ఓ సందర్భంలో.. విమానం కావాలన్నా దిల్‌సుఖ్‌నగర్‌లో దొరుకుతుంది అంటూ సీఎం చేసిన కామెంట్లను, తాజా కామెంట్లను కలిపి వీడియోలు చేసి షేర్ చేస్తున్నారు. సీఎం ఫ్రస్టేషన్లో ఉన్నారని, అందుకే ఇలా తరుచూ తడబడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పాలనలో విఫలం అవుతుండటం, సహచర మంత్రుల నుంచి సహకారం లేకపోవడం, అధిష్ఠానం పెద్దగా పట్టించుకోకపోవడం, మంత్రులు తరుచూ వివాదాల్లో చిక్కుకుంటుండటం, కోర్టు సమస్యలు.. ఇలా సీఎం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్తున్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోక ఇలా తడబడుతున్నారని విశ్లేషిస్తున్నారు.