CM Revanth Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కంప్యూటర్ను పుట్టించిందే మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సెల్ఫోన్లు, కంప్యూటర్ను మన దేశానికి పరిచయం చేసింది ఆయనే అని, దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కుతుందని చెప్పారు. సచివాలయం ఎదుట ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ గాంధీల కుటుంబానిది త్యాగాల చరిత్ర అని కొనియాడారు.
జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, పదేండ్లు జైలులో ఉన్నారని గుర్తుచేశారు. ప్రధానిగా 563 సంస్థానాలను దేశంలో విలీనం చేయించి దేశ సమగ్రతను కాపాడారని చెప్పారు. విద్య, సాగునీటి రంగాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని దేశ భవిష్యత్తుకు పునాదులు వేశారన్నారు. నెహ్రూ బతికి ఉండగా ఇందిరా గాంధీ ఏ పదవీ తీసుకోలేదని, ఆమె మరణం తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారని చెప్పారు.
రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత 2004-14 మధ్య సోనియా గాంధీ ఏ పదవీ తీసుకోలేదని గుర్తుచేశారు. ‘రాజీవ్‌గాంధీ కంప్యూటర్ను పరిచయం చేయకపోయి ఉంటే ఐటీ శాఖ అనేదే లేకపోవు.. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రే కాకపోవు..’ అని పేర్కొన్నారు. సచివాలయంలో డిసెంబర్ 9లోగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.