హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): నవంబర్ 30లోపు కులగణన పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో బుధవారం కులగణనపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులగణనపై సోనియా, రాహుల్‌గాంధీ మాట ఇచ్చారని, ఆ మాటను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదని హెచ్చరించారు. కులగణనపై సమన్వయం చేసుకునేందుకు పార్టీ నుంచి 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ను నియమించాలని సూచించారు. కులగణనలో దేశానికి తెలంగాణను ఒక మోడల్‌గా చూపించాలని అన్నారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని పరోక్షంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి హెచ్చరికలు జారీచేశారు.