ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించినట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ నమూనాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరుతోనే పట్టాలు మంజూరు చేస్తామని, అర్హులైన ప్రతి పేద మహిళకు ఇల్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని వెల్లడించారు.
భద్రాచలం ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, రూ.500 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిధులు మంజూరు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధికి చేసిందేమీ లేదని చెప్పారు. తొలుత సీఎం, మంత్రులు భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. శ్రీరామనవమి పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భటి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీదర్‌బాబు, పొన్నం, సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భద్రాచలంలోని మార్కెట్ యార్డులో సోమవారం ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్‌శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ భద్రాచలం ఆలయ అభివృద్ధిపై చర్చించి, నిధులు విడుదల చేస్తామన్నారు.
ఏడాదికి 2 కోట్ల చొప్పున యువతకు ఉద్యోగాలిస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పదేండ్లు పూర్తి కావొస్తున్నా ఆ హామీని పట్టించుకోవడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం భద్రాద్రి జిల్లా మణుగూరులో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రేవంత్ మాట్లాడారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తెచ్చి నిరుపేదల ఖాతాల్లో జమ చేస్తామని మోదీ ప్రగల్భాలు పలికారని ధ్వజమెత్తారు. 2022కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ ఇప్పుడు రైతు ఆత్మహత్మలకు కారణమయ్యారని ఆరోపించారు. 1969లో తెలంగాణ ఉద్యమం పాల్వంచ కేంద్రంగా పురుడు పోసుకున్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ చూస్తున్నాయని తెలిపారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో ఆ నలుగురు తప్ప ఎవరూ మిగలరని అన్నారు.