హైదరాబాద్, ఆగస్టు28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు, తదితర అంశాలపై చర్చించారు. వాస్తవంగా తమ్మిడిహట్టి బరాజ్ ఎత్తు పెంపు అంశంపై తెలంగాణ, మహారాష్ట్ర అధికారులతో సెప్టెంబర్ ఒకటిన, కృష్ణా జలవివాదాల అంశంపై 7వ తేదీన ఏపీ, తెలంగాణ మధ్య కేంద్ర జల్‌శక్తి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో సీఎం ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేశారు. ఆయా సమావేశాల్లో చర్చించాల్సిన ఎజెండా అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చస్తారని అందరూ భావించారు. కానీ సమీక్షలో ఆ రెండు సమావేశాలకు సంబంధించిన అంశాలేవీ చర్చకు రాలేదని జలసౌధ వర్గాలు వెల్లడించాయి. కేవలం కృష్ణా ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న వాదనలపై మాత్రమే సీఎం సమీక్షించారని తెలిపాయి.