హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సచివాలయంలో పలు అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశం ఇటు ప్రభుత్వ, అటు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంబంధిత మంత్రులు లేకుండానే వారి శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష జరపడం పట్ల కాంగ్రెస్ ముఖ్యనేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రులను సమీక్షకు పిలవలేదా? పిలిచినా రాలేదా? అని కాంగ్రెస్ వర్గాలు చర్చించుంటున్నాయి. రాష్ట్రంలో రైతురుణమాఫీ, ధాన్యం కొనుగోళ్ల అంశంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు లేకుండానే అధికారులతో సమీక్షించిన సీఎం వారికి పలు ఆదేశాలు సైతం జారీచేశారు. గతంలో కూడా రెండు పర్యాయాలు మంత్రి తుమ్మల లేకుండానే వ్యవసాయశాఖపై సీఎం సమీక్షించారు. మలాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న తుమ్మల లేకుండానే గతంలో అక్కడి పరిస్థితిపై రివ్యూ చేశారని, దుమ్ముగూడెంపై కూడా మంత్రి లేకుండానే సమీక్షించారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు.
తాజాగా మరోసారి తుమ్మల లేకుండానే వ్యవసాయ శాఖపై సమీక్షించడం అనేక సందేహాలకు తావిస్తున్నది. ఇదిలాఉండగా డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క లేకుండానే రైతురుణమాఫీ అంశంపై కూడా సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించడం చర్చనీయాంశంగా మారింది. రైతురుణమాఫీ చేయాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలు తదితర అంశాలపై ఆర్థికశాఖతో చర్చించాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖ మంత్రి భట్టి లేకుండానే సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సమీక్షలకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హాజరు కావడం గమనార్హం. దీనిపై ఇప్పుడు ప్రభుత్వ, కాంగ్రెస్ వర్గాల్లో చర్చకొనసాగుతున్నది.
సమాచారం లేకుండానే క్యాబినెట్ !
మరోవైపు కనీస సమాచారం ఇవ్వకుండానే 18వ తేదీన క్యాబినెట్ సమావేశం ఏర్పాటుచేశారని పలువురు మంత్రులు సైతం కినుక వహించినట్టు తెలుస్తున్నది. తమను సంప్రదించకుండానే తేదీ నిర్ణయించడంపై పలువురు మంత్రులు తమ అనుచరుల ముందు మండిపడుతున్నట్టు తెలుస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పలువురు మంత్రులు వ్యక్తిగతంగా వివిధ కార్యక్రమాలను నిర్ణయించుకున్నారు. కొందరు పొరుగు రాష్ర్టాలకు వెళ్లేందుకు ప్రణాళిక వేసుకోగా.. మరో కీలక మంత్రి ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్నారు. అయితే ముందస్తుగా సంప్రదించకుండా, ఏకపక్షంగా క్యాబినెట్ భేటీ తేదీని సీఎం రేవంత్ ఖరారు చేయడాన్ని పలువురు మంత్రులు ఆక్షేపిస్తున్నట్టు తెలుస్తున్నది.