CM Revanth Reddy | రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం అవసరమైన మార్గదర్శకాలను ప్రతిపాదించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధరణి పనితీరు, భూ సంబంధిత అంశాలపై సీఎం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు భట్టి విక్రమార్క, దామోదర రాజ నర్సింహా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూసంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా కమిటీ ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ సంబంధిత చట్టాల్లో నిష్ణాతులు సభ్యులుగా ఉండాలన్నారు. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై సవివర నివేదిక అందజేయాలని సీఎస్‌ను ఆదేశించారు.