కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ముందుకు వెళ్లాలని అన్నారు. తాత్కాలికంగా హడావుడి చేసి మరోసారి తప్పులకు తావివ్వద్దని ఇరిగేషన్ విభాగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. సాంకేతికంగా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని తదుపరి మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై నిర్ణయం తీసుకోవాలన్నారు.
సుమారు లక్షన్నర కోట్లతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టు రిపేర్లకు ఎనిమిది, పది వేల కోట్లు అవసరమైతే ఖర్చుకు ఆలోచించాల్సింది లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతో పాటు, రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రెండు మూడు రోజుల్లోనే వీరందరితో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కుంగిన ఫిల్లర్లను రిపేర్లు చేయిస్తే సరిపోతుందా.. లేదా ఉన్నవి తొలిగించి కొత్తవి కట్టాలా.. కొన్నింటిని రిపేర్లు చేసి కొన్నింటిని కొత్తగా నిర్మిస్తే సరిపోతుందా… అనేది ఈ కమిటీతో సమగ్రంగా అధ్యయనం చేయిస్తామని చెప్పారు.
కృష్ఱా జలాల్లో మన రాష్ట్ర నీటి వాటాలు, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కృష్ణ జలాలకు సంబంధించి జరిగిన సమావేశాలు… కేఆర్ఎంబీ ఎజెండాలు, చర్చల వివరాలు, మినిట్స్, నిర్ణయాలు, ఒప్పందాలన్నింటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. వీటన్నింటిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దామని సీఎం అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల కృష్ణా జలాల వాటాలో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు.. అప్పుడేం చర్చలు జరిగాయి.. ఏమేం నిర్ణయాలు జరిగాయో.. వాటన్నింటిపై అఖిల పక్ష సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టులవారీగా ఆయకట్టు వివరాలలో కొంత గందరగోళం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామాలు, మండలాల వారీగా ప్రాజెక్టుల ఆయకట్టు వివరాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులపై వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ప్రాధాన్యతలవారీగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కల్వకుర్తి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ఎందుకు ముందుకు సాగడం లేదని అధికారులను ప్రశ్నించారు. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. వీలైనంత త్వరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ టన్నెల్ పనులను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని పూర్తి చేయాలని చెప్పారు. ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని అన్నారు.
అసంపూర్తిగా ఉన్న కొన్ని ప్రాజెక్టులను గ్రీన్ ఛానెల్ ద్వారా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను గుర్తించి ఆయకట్టు రైతులకు నీరందించే చర్యలు చేపట్టాలని అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, నారాయణపేట కొడంగల్ లిప్ట్ లను ప్రస్తావించి, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల జాబితాను తయారు చేయాలన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ముందున్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను వందశాతం పూర్తి చేయాల్సిందేనని అన్నారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.