హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర బృందం అమెరికా, దక్షిణ కొరియా ముగించుకొని బుధవారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ పర్యటనల సందర్భంగా రూ.36 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా పర్యటనలో రూ.31,502 కోట్ల పెట్టుబడులు, దక్షిణ కొరియా పర్యటనలో రూ. 4,500 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు తెలిపింది. రెండు దేశాల్లో మొత్తం 25 కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. జేఐ టెక్ కంపెనీ రూ. 100 కోట్లతో ఎల్ఈడీ మెటీరియల్ తయారీ ప్లాంట్, చావి కంపెనీ ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాను తయారు చేయనున్నట్టు ప్రకటించింది. ఎల్ఎస్ గ్రూప్, పోసో, తదితర కంపెనీల ప్రతినిధులతోనూ బృందం చర్చలు జరిపింది.
మరిన్ని చిన్న వార్తలు
పూడికతీతపై ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం
హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): ప్రాజెక్టుల్లో పూడికతీతకు ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్న మార్గదర్శకాలపై అధ్యయనం చేయాలని నీటిపారుదల శాఖ భావిస్తున్నది. సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీకి ఇటీవల నివేదిక అందజేసింది. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ మాత్రమే పూడికతీత పాలసీలను అమలు చేస్తున్నాయని నీటిపారుదల శాఖ తెలిపింది. ఆయా రాష్ర్టాలు అమలుచేస్తున్న పాలసీల్లోని అంశాలను నివేదికలో పొందుపరిచింది. ఇప్పటికే రాజస్థాన్ సందర్శించామని, మిగిలిన రాష్ర్టాల్లోనూ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని పేర్కొన్నది. తద్వారా సమగ్రమైన విధానాలను రూపొందించుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
రూ.150 కోట్లతో కర్టెన్ గ్రౌటింగ్
హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ): రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కరకట్ట నుంచి నీటి లీకేజీలను నిరోధించేందుకు రూ.150 కోట్లతో కర్టెన్ గ్రౌటింగ్ ప్రక్రియ చేపట్టాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గానికి సాగు, తాగునీటిని అందించేందుకు 2011లో గుడ్డందొడ్డిలో 2.30 టీఎంసీల సామర్థ్యంతో రేలంపాడు రిజర్వాయర్ నిర్మించారు. నీటి లీకేజీ నివారణకు జియోఫిజికల్, టెక్నికల్ పరీక్షలను నిర్వహించారు. సీపేజీ నివారణకు కర్టెన్ గ్రౌటింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు.
7 లక్షల ఎకరాలు తగ్గిన సాగు
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): వానకాలం పంటల సాగు భారీగా తగ్గుతున్నది. గతేడాదితో పోల్చితే 7 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఈ మేరకు పంటల సాగు విస్తీర్ణంపై వ్యవసాయ శాఖ వివరాలు వెల్లడించింది. నిరుడు ఇదే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 1.01 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా ప్రస్తుతం 94 లక్షల్లోనే సాగయ్యాయి. ముఖ్యం గా పత్తి, వరి, మక్కజొన్న సాగు గణనీయంగా తగ్గింది. సాగు తగ్గుదలపై అధికారులు, శాస్త్రవేత్తలు పలు కారణాలను విశ్లేషిస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, చెరువులు, కుంటల్లో నీళ్లు లేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. రైతులకు ఈ సీజన్లో ఇప్పటి వరకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందలేదు. దీంతో రైతులు పెట్టుబడి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సాగు విస్తీర్ణం తగ్గిందని భావిస్తున్నారు.