ఢిల్లీ: తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ.11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో అమిత్ షాతో సోమవారం సమావేశమైన రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారని, లక్షకుపైగా పశువులు, ఇతర మూగ జీవాలు మృతిచెందాయని, 4.15 లక్షల ఎకరాల్లో పంటతో పాటు రోడ్లు, కల్వర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంటలు, కాలువలు దెబ్బతిన్నాయని కేంద్ర హోం మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. ఆయా పనులకు రూ.5,438 కోట్లు విడుదల చేయాలని సెప్టెంబరు రెండో తేదీన తాను లేఖ రాసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
రాష్ట్రంలో పంట, ఇతర నష్టాలపై కేంద్ర బృందం పర్యటించి మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.11,713 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సెప్టెంబరు 30వ తేదీన నివేదిక సమర్పించిందని సీఎం తెలిపారు. ఆ నిధులు పునరుద్ధరణ, మరమ్మతుల పనులకు ఎంతమాత్రం సరిపోవని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిని ఇప్పటి వరకు విడుదల చేయనందున వెంటనే ఆ నిధులు విడుదల చేయాలని కోరారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ మొదటి, రెండో విడతల కింద తెలంగాణకు రూ.416.80 కోట్లను కేంద్రం విడుదల చేసిందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. పునరుద్ధరణ, మరమ్మతు పనులకు విడుదల చేసే నిధులను గతంలో ఎస్డీఆర్ఎఫ్ పనులకు సంబంధించిన నిధులు ఉపయోగానికి ముడిపెట్టవద్దని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఆ మూడు జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో కొనసాగించాలి
వామపక్ష తీవ్రవాద ప్రభావిత (ఎల్‌డబ్ల్యూఈ) జిల్లాల నుంచి తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో తిరిగి చేర్చాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎల్ డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లతో తెలంగాణకు సరిహద్దు ఉండటంతో రాష్ట్ర భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సరిహద్దుల్లోని మలుగు జిల్లా పేరూరు, ములుగు, కన్నాయిగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల, మహాముత్తారం, కాటారం వంటి పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు.