Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల ఆక్రమణలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వెల్లుతున్నాయి. యూనివర్సిటీ భూముల్లో చేపడుతున్న పనులన్నిటినీ తక్షణమే నిలిపివేయాలని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యులు అవుతారని అత్యున్నత ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇక ముందు ఏం చేయాలో కర్తవ్యబోధన చేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి ఆగమేఘాలపై మంత్రుల కమిటీని నియమించారు.
ఈ కమిటీలో మంత్రులు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కార్యనిర్వాహక కమిటీ, జేఏసీ, పౌర సమాజ సమూహాలు, విద్యార్థి ప్రతినిధి బృందాలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. అయితే కథ మొత్తం అడ్డం తిరిగాక రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం అయినట్టు నటిస్తున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. నిన్నటిదాకా అటవీ ఆవరణాన్ని విధ్వంసం చేయొద్దని, యూనివర్సిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, విద్యార్థులు, మేధావులు, పర్యావరణ వేత్తలు, ప్రొఫెసర్లు ఎన్నో రకాలుగా మొత్తుకున్నారు. వారి సూచనలను పట్టించుకోని, అసలే వినిపించుకోని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. సుప్రీంకోర్టు మొట్టికాయల నేపథ్యంలో మెట్టు దిగినట్టు అభినయిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
తాను ఎవరి మాటా వినేది లేదన్న వైఖరితో రాత్రికి రాత్రే 50 బుల్డోజర్లు పెట్టి ఏకపక్షంగా అడవిని విధ్వంసం చేసి, అందులోని వన్యప్రాణులను హడలెత్తించి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామనుకున్న సీఎం రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టు హెచ్చరికలతో ఒక్కసారిగా చర్చలు, కమిటీలు, సంప్రదింపులు అంటూ దిగిరావడంపై రాజకీయ సర్కిళ్లలో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఈ పనే ముందుగా చేసి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగి ఉండేది కాదు కదా.. అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయొద్దని అడ్డంపడిన విద్యార్థులను పెయిడ్ బ్యాచ్ అని, గుంటనక్కలు అంటూ వారిపై లాఠీచార్జ్ చేయించి, అక్రమ కేసులు బనాయించిన సీఎం ఇప్పుడు మంత్రుల కమిటీని వేయడం ఆయన రాజకీయ అపరిపక్వతను, పరిపాలనా హీనస్థితిని బయటపెట్టిందని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అడుసు తొక్కి కాళ్లు కడుక్కోవడం రేవంత్‌రెడ్డికి పరిపాటిగా మారిందని, లగచర్లలో ఫార్మా విలేజ్ కోసం గిరిజనుల భూములను గుంజుకునే సందర్భంగా చెలరేగిన ప్రజా తిరుగుబాటుతోనే ఆయన గుణపాఠం నేర్చుకోవాల్సి ఉండెనని, యూనివర్సిటీ భూముల ఆక్రమణ వ్యవహారం తర్వాత ఆయన మనస్తత్వం అంతేనని, ఆయన ఇక మారరనే విషయం రుజువైందని రాజకీయ విమర్శకులు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.