హైదరాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ) : వివాదాస్పదంగా మారిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఉదంతాన్ని సాకుగా చూపుతూ మంత్రులందరి అధికారులకు కత్తెర వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రంగం సిద్ధంచేసినట్టు తెలుస్తున్నది. మంత్రుల పేషీలపై నిఘాను మరింత పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన బాధ్యతలను ఇంటెలిజెన్స్, ఏసీబీ విభాగాలకు అప్పగించినట్టు చర్చ జరుగుతున్నది. పేషీలో ప్రతి అంశాన్ని రికార్డు చేయాలని సదరు అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. ప్రతి ఫైల్‌కు సంబంధించిన అంశాన్ని, ప్రతి అధికారి కదలికలపై నిఘా పెట్టాలని, ప్రతి సందర్భాన్ని సీఎంవోకు రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ముఖ్యంగా టెండర్లు, ఆర్థికాంశాలు, అనుమతులకు సంబంధించిన ఫైళ్లు కచ్చితంగా సీఎంవో దృష్టికి తీసుకొనిరావాలని ఆదేశించినట్టు తెలుస్తున్నది.
పేషీలపై నిఘా అంటే.. పరోక్షంగా మంత్రుల అధికారాలకు, స్వేచ్ఛకు కత్తెర వేయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ పేషీలపై నిఘా పెట్టాలన్న నిర్ణయాన్ని మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. ఏదో ఒక ఘటన జరిగితే మొత్తం వ్యవస్థకే ఆపాదించడం ఏమిటని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఈ సాకుతో తమ అధికారాలను గుప్పిట్లోకి లాక్కోవడం ఏమిటని నిలదీస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక ప్రతి ఫైలుకు సీఎంవో అనుమతి కావాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. మంత్రులుగా ఉంటూ చిన్నచిన్న పనులకు కూడా సీఎం, సీఎంవో అనుమతి కోసం పడిగాపులు కాయాల్నా? అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఓ మంత్రి స్పందిస్తూ… ‘మా పేషీల సంగతి పక్కనపెట్టి ముందు సీఎంవోలో ఏం జరుగుతున్నదో చూసుకోండి’ అని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ముందు సీఎంవోను చక్కదిద్దాలని, సీఎంవో కేంద్రంగానే భారీ ఎత్తున అవినీతి జరుగుతున్నదనే ఆరోపణలను ఆయన గుర్తుచేసినట్టు తెలిసింది. నిఘా నిర్ణయం అమల్లోకి వస్తే ఏ పేషీలోనూ స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఉండదని, ప్రతిక్షణం భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.