Congress Govt | హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇరిగేషన్‌శాఖ అత్యంత ప్రాధాన్యత కలిగినదని ఇటీవల జలసౌధ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన విధానాలను అమలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్‌శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులేవీ విడుదల చేయవద్దని ఆర్థికశాఖపై ఆంక్షలు విధించారని తెలుస్తున్నది. వెరసి చిన్న కాంట్రాక్టర్లు నెలలతరబడిగా జలసౌధ చుట్టు ప్రదక్షిణలు చేస్తూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. మరోవైపు బిల్లుల మంజూరు నిలిచిపోవడంతో సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టలు, కాలువలకు సంబంధించి చేపట్టిన మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని దుస్థితి నెలకొన్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరు చేసిన పనుల్లో దాదాపు 73శాతం పనులు మొదలే కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అధికారులు వాపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 18నెలల కాలంలో ఇరిగేషన్‌శాఖకు మొత్తంగా రూ.12,855 కో ట్లను విడుదల చేసింది. అందులో ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకున్న 12 ప్రాజెక్టులకే భూసేకరణ, పనుల కోసం దాదాపు రూ.3,377 కోట్లను చెల్లించింది. ఇతర ప్రాజెక్టులకు సంబంధించి మొత్తంగా రూ.9,478 కోట్లను చెల్లించింది. నిధుల్లో భారీగా పెండింగ్ బిల్లులనే చెల్లించింది. అందులో దాదాపు 75శాతం నిధులు బడా కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులేనని తెలుస్తున్నది. ఓఅండ్ఎం బిల్లులను సర్కారు చెల్లించడంలేదని చిన్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేసేందుకే రూ.4860 కోట్లు అవసరమని అధికారుల అంచనా. ఇటీవల జలసౌధకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిల్లులు పెండింగ్ ఉన్నాయని, దశలవారీగా విడుదల చేస్తామని వెల్లడించారు. కానీ తాజాగా ఇరిగేషన్ పెండింగ్ బిల్లుల చెల్లింపును పూర్తిగా నిలిపేయాలని ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడం గమనార్హం.
ప్రభుత్వం నిధులను నిలిపేయడంతో చిన్న కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. చెరువులు, ప్రాజెక్టుల ఓఅండ్ఎం పనులను నిర్వహించిన కాంట్రాక్టర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 18నెలలుగా ఇరిగేషన్‌శాఖలోని బడాబడా ఏజెన్సీలకు మినహా చిన్నాచితక ఏజెన్సీలకు రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో చేసిన పనులకు బిల్లులు రాక, మిగిలిపోయిన పనులను చేయలేక సతమతమవుతున్నారు.
ప్రభుత్వం బిల్లులపై ఆంక్షలు విధించడంతో కొత్త ప్రాజెక్టుల సంగతేమో కానీ ఓఅండ్ఎం పనులను కూడా ముందుకు సాగని దుస్థితి నెలకొన్నది. ఓఅండ్ఎం పనులను సాధారణంగా చిన్న గుత్తేదారులు నిర్వహిస్తుంటారు. ఆర్థిక వనరుల పరిమితి తక్కువే. కాంపోనెంట్ల వారీగా మరమ్మతులు పూర్తిచేసిన కొద్దీ అందుకు సంబంధించిన బిల్లులను చెల్లిస్తేనే తదుపరి పనులను వేగవంతంగా ముందుకు సాగిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం వల్లే ఓఅండ్ఎం పనులు మందకొడిగా కొనసాగడానికి ప్రధాన కారణమని ఇటు క్షేత్రస్థాయి ఇంజినీర్లు, అటు గుత్తేదార్లు వివరిస్తున్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 1294 పనులకు ఆమోదం తెలపగా, 478 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో జనవరి చివరి వరకు 1000 పనులను చేపట్టేందుకు ఆమోదం ప్రభుత్వం తెలిపింది. 750 పనులు పెం డింగ్‌లో ఉన్నాయి. అన్ని పనులు టెండర్ స్టేజీలోనే ఉండిపోయాయంటే ఓఅండ్ఎం పనులు కొనసాగుతున్న తీరుకు అద్దం పడుతుంది. నిరుడు భారీ వరదలకు వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జి ల్లాలో పదుల సంఖ్యలో చెరువులు తెగిపోయాయి. వాటిని తాత్కాలిక మరమ్మతులు చేశారు. శాశ్వత మరమ్మతులకు అనుమతులు ఇచ్చారు. అందుకు సంబంధించిన చాలా పనులను ఇప్పటికీ ప్రారంభించని దుస్థితి నెలకొన్నది.