హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అన్నివేళలా కంటికిరెప్పలా.. రక్షణ కవచంలా నిలబడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాజకీయంగా ఢిల్లీలో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అన్ని రకాల రక్షణలను కల్పిస్తూ ఆయనను కంటికిరెప్పలా కాపాడుతున్నదని దుయ్యబట్టారు. దాదాపు 15 నెలల కాలంలో ఇకడి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేక సామ్‌లకు పాల్పడుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని తెలిపారు. నాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంపై ఆగమేఘాల మీద స్పందించి కేంద్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించి, విచారణల పేరుతో వేధింపులకు పాల్పడిన బీజేపీ ప్రభుత్వం ఇకడి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్‌వాల్ కూలిన ప్రమాదంతో పాటు తాజాగా ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన పెను ప్రమాదాలపై కనీసం స్పందించకపోవటం వెనుక అనేక అనుమానాలున్నాయని ఆదివారం ఎక్స్‌వేదికగా పేర్కొన్నారు. గతంలో ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ), ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పందించిన విధంగా జరిగిన ప్రమాదాలపై విచారణ చేసి, కారణాలు కనుకొని ప్రజలకు వివరిస్తాయా? లేక ఎప్పటిలానే ఇకడి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాయా? అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రాహుల్‌గాంధీ బీజేపీపై విమర్శలు చేస్తూ పోరాటం చేస్తున్నట్టు చెప్పుకొని తిరుగుతుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని అనేకసార్లు స్పష్టమైందని ఉదహరించారు.
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు కాపాడుతున్నదో అంతుచిక్కటం లేదని, అది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని కేటీఆర్ విమర్శించారు. తాజాగా రేవంత్‌రెడ్డి సరైన సమయంలో బీజేపీలో చేరుతానని హామీ ఇచ్చి లోపాయికారి ఒప్పందం చేసుకోవడం వల్లే తెలంగాణ కేంద్ర మంత్రులతో సహా మొత్తం బీజేపీ నాయకులు రేవంత్‌రెడ్డిని కాపాడుతూ రక్షణ కవచంగా నిలుస్తున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానుచేస్తున్న ఆరోపణలో వాస్తవం లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచకాలపై వెంటనే స్పందించి తన చిత్తశుద్ధి బీజేపీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
కేంద్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖకు చెందిన రూ.1337 కోట్ల నిధులను సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత బావమరిదికి అప్పనంగా కట్టబెట్టి, అమృత్ పథకంలో చేసిన సాంకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా వెళ్లి అందజేశామని, సాక్ష్యాలు అందించినా ఇప్పటికీ కేంద్రం స్పందించకపోవటం అంటే రేవంత్‌రెడ్డిని కాపాడుతున్నట్టేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి చదరపు అడుగుకు రూ.150 చొప్పున ఆర్ఆర్ (రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ) ట్యాక్స్ పేరిట పన్ను వసూలు చేస్తున్నదని ప్రధాని మోదీ స్వయంగా పేర్కొన్నారని, కనీసం వాటిపై బీజేపీ ఒక మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేసి, భారీగా నగదు, ఆస్తులను గుర్తించినట్టుగా వార్తలు వచ్చి ఐదు నెలలు దాటినా ఇప్పటికీ అటు ఈడీ గాని, ఇటు మంత్రిగాని వాటిపై అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదని గుర్తుచేశారు.