గండిపేట జలాశయానికి వెళ్లే దారిలోనే ఉన్న రెండు నిర్మాణాలు ఇవి.. నిజానికి ఎడమవైపు ఉన్న కట్టడం జలాశయానికి మరింత సమీపంలో ఉన్నది. అయినా, హైడ్రా కుడివైపు ఉన్న నిర్మాణాన్ని మాత్రమే కూల్చివేసింది. కుడివైపునే, దానికంటే ముందు నిర్మాణంలో ఉన్న మరో కట్టడాన్ని అది ముట్టుకోలేదు. ఎడమవైపు ఉన్న కట్టడం చేసిన ఒప్పేమిటి? కుడివైపు ఉన్న కట్టడం చేసిన తప్పేమిటి. ఒకదాన్ని కొట్టి మరోదాన్ని నిలబెట్టడంలో మాయేమిటి?
రాజకీయం చిత్రమైనది. పైకి కనిపించేది ఒకటి, లోపలి మర్మం మరొకటి! అక్రమమేదైనా అక్రమమే. రాజకీయమే జీవితం అనుకున్న వాళ్లకు తన వాళ్లంతా సక్రమంగా, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే అక్రమంగా కనిపిస్తారు. ప్రస్తుతం హైడ్రా పేరుతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం కూడా అచ్చం ఇలాగే ఉంది. కేసీఆర్ కుటుంబ సభ్యులపై బురద జల్లడమే లక్ష్యంగా సాగుతున్న ‘బద్నాం రాజకీయం’ టార్గెట్ కూడా ఇదే. జరగనిది జరిగినట్టు, జరిగినది జరగనట్టు మాయచేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు రాష్ట్ర ప్రజలను భ్రమింపజేయడానికి హైడ్రాను వాడుకుంటున్నది.
కేటీఆర్ ఫామ్‌హౌస్ అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెగబడింది. అసలు హైదరాబాద్ జంట జలాశయాల సమీపంలో పరిస్థితి ఏమిటి? ఎవరెవరికి ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి? వారిలో కాంగ్రెస్ ప్రముఖులెవరు? ఎఫ్టీఎల్లో ఉన్నవేమిటి? బఫర్ జోన్లో ఉన్నవేమిటి? అసలు హైకోర్టు అడిగినట్టు ఎఫ్టీఎల్ను ఎవరు నిర్ధారించారు? మరి కొందరివే ఎందుకు కూలుస్తున్నారు? కొందరివి ఎందుకు కూల్చడం లేదు? అంతరార్థం సుస్పష్టం.
ఆస్తుల ధ్వంసం, తద్వారా ఇమేజ్ హననం కూడా ఒక రాజకీయ ఆయుధమే! అక్రమ కట్టడాలను అడ్డుకోవడం తప్పుకాదు. కానీ ఆ పేరుతో చట్టాన్ని ఇష్టారాజ్యంగా వాడుకోవడం, ఒక్కొక్కరికి ఒక్కొక్కరకంగా వర్తింపజేయడం, తద్వారా వ్యక్తిత్వాల కూల్చివేతే అసలు సమస్య. హైడ్రా ద్వారా ప్రభుత్వం చేస్తున్నది ఇదే.
ఈ నేపథ్యంలో అసలు గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలో ఏం జరుగుతున్నది? తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ ప్రత్యేక బృందం అక్కడ పర్యటించింది. ఈ పర్యటనలో తెలుసుకున్న విషయాల ఆధారంగా.. ఆయా ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు, వాటి ఫొటోలు, గూగుల్ మ్యాప్‌ల సమాహారమైన కథనం నమస్తే పాఠకులకు ప్రత్యేకం.
CM Revanth Reddy | (గుండాల కృష్ణ) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): నోరు మంచిదైతే ఊరు మంచిదైతదంటరు! అట్లనే సర్కారు ఉద్దేశం ప్రజా ప్రయోజనమైతే వీసమెత్తు అనుమానాలు తలెత్తవు. అంతకుమించి ఆరోపణలు అసలే ఉండవు. కానీ హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) పురుడుపోసుకొని నెల రోజులు కాకముందే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దాని ప్రతి అడుగు అనుమానాలకు తావిస్తున్నది. హైడ్రా కమిషనర్‌గా ప్రభుత్వం నియమించిన ఏవీ రంగనాథ్ ట్రాక్ రికార్డ్‌పై ఏ ఒక్కరికీ సందేహాలు లేవు. కాకపోతే సర్కారు సైగలో… ఆక్రమణలను నిర్ధారించే ప్రభుత్వ శాఖ లోపభూయిష్ట నిర్ణయాలో… కారణమేదైనా! కండ్ల ముందు కనిపించే ఒక నిర్మాణాన్ని అక్రమమంటూ కూల్చివేసిన హైడ్రా… దాని పక్కనే ఉన్న దానిని విస్మరించడమంటే ఇంతకీ కూల్చినది అక్రమమా? వదిలేసినదీ సక్రమమా!? సూటి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ ఏజెన్సీపైనే ఉంది. అంతకుమించి జంట జలాశయాల పరిధిలో దశాబ్దాలుగా విలాసవంతమైన ఫాంహౌస్‌లు ప్రజల అనుభవంలోనే ఉన్నప్పటికీ నాలుగైదు నిర్మాణాల్ని లక్ష్యంగా ఎంచుకొని హైడ్రా వాటిని నేలమట్టం చేయడమే ఇప్పుడు ‘దాల్మే కుచ్ కాలాహై!’ అన్న అనుమానాలను కలిగిస్తున్నది.
అంతకుమించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో నిర్దారించిన హద్దును దాటి ఆ ఏజెన్సీ అడుగులు వేస్తుండటం రాజకీయ ప్రతీకార చర్యలకు హైడ్రా పావుగా మారుతుందనే సందేహాలను రేకెత్త్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు… వారసత్వ సంపదగా వస్తున్న అమూల్యమైన నీటి వనరులను కాపాడటంలో రాష్ట ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిగీసి ఎఫ్టీఎల్ను నిర్ధారించాలి… నిర్మాణమెవరిదైనా సరే రాజకీయాలకు అతీతంగా కూల్చివేతల యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. అప్పుడు ప్రజలు ‘శభాష్’ అంటారు. కానీ అయినవారికి అంచున… కానివారికి కంచాన అన్నట్లుగా బుల్డోజర్లు ప్రయోగిస్తామంటే ప్రభుత్వమే అభాసుపాలవుతుంది. ముఖ్యంగా దశాబ్దాలుగా జంట జలాశయాల గొంతునులిమే రీతిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ‘సంతృప్తి’కరంగా నిర్లక్ష్యం చేసిన జలమండలి మాటలు పట్టుకొని కూల్చివేతల్ని కొనసాగిస్తే అంతిమంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సింది హైడ్రానే అన్న వాస్తవాన్ని కమిషనర్ రంగనాథ్ గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది.
కూల్చివేతలకు ముందు సంబంధిత అధికారి చట్టప్రకారం భవన యజమానికి నోటీసు ఇవ్వాలి కదా? నోటీసు ఇవ్వకుండా కూల్చివేయొచ్చా? ఏ అధికారం కింద కూల్చివేస్తారు? నోటీసు ఇవ్వాలి. ఆక్రమణదారుల, అనధికార నిర్మాణదారుల హక్కుల పత్రాలను ప్రాథమిక పరిశీలన చేయాల్సిందే.
కూల్చివేసిన తన నిర్మాణానికి సంబంధించి ఓ యజమాని హైడ్రా ఉన్నతాధికారి వద్దకు వెళ్లి ‘సార్.. కూల్చివేసే ముందు కనీసం నోటీసులు ఇవ్వాలి కదా!’ అని అడిగారు. అందుకు ఆ ఉన్నతాధికారి ఇచ్చిన జవాబు ఏమిటంటే ‘అలా ముందస్తు నోటీసులు ఇస్తే, మీరు కోర్టుకు వెళ్తారుగా!’ అని. ఎవరైనా కోర్టుకు వెళ్లే హక్కుని హైడ్రా ఎలా అడ్డుకుంటుంది. న్యాయం చెప్పాల్సింది కోర్టా? హైడ్రానా?
ఇది రాష్ట్రమంత్రి, కాంగ్రెస్ ముఖ్యనేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి హిమాయత్‌సాగర్ జలాశయం సమీపంలో ఉన్న విశాలమైన ఫామ్‌హౌస్ (ఎర్రటి పెంకులతో ఉన్నది). దాని పక్కనే నల్లటి పైకప్పుతో ఉన్నది ఆయన సోదరుడి ఫామ్‌హౌస్‌గా చెప్తారు
1. అసలు ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించింది ఎప్పుడు? అక్కడ హద్దురాళ్లున్నాయా? ఎఫ్టీఎల్ హద్దురాళ్లను పీకేసి, మట్టి నింపి, ఏండ్ల తరబడి ఫామ్‌హౌస్‌లు కడుతుంటే ప్రభుత్వాలు, విభాగాలు ఏం చేస్తున్నాయి? ఎఫ్టీఎల్కే హద్దురాళ్లు లేకపోతే ఇక బఫర్‌జోన్‌ను కనుక్కునేది ఎలా?
2. గండిపేట జలాశయం ఎఫ్టీఎల్ 1792 అడుగులా? లేక 1790 అడుగులా? ఈ జలాశయం నిర్వహణను చూసే జలమండలి రికార్డుల్లోనే రెండు రకాల ఎఫ్టీఎల్లు ఎలా ఉంటాయి? ఎఫ్టీఎల్ను రెండు అడుగుల మేర కుదించే అధికారం జలమండలికి ఉన్నదా?
3. ఎఫ్టీఎల్ మీద స్పష్టత లేదు. హద్దురాళ్లు లేవు. ఇలాంటప్పుడు హైడ్రా దేని ఆధారంగా ఏది ఎఫ్టీఎలో, ఏది బఫర్జోనో నిర్ణయిస్తున్నది? ఏ ప్రకారం కూల్చివేతలకు దిగుతున్నది? హైడ్రా ఏర్పాటు జీవో జాబితాలో పేర్కొనని గ్రామాల్లో (చిల్కూరు, హిమాయత్‌నగర్, అప్పోజిగూడ) సైతం హైడ్రా ఎలా కూల్చివేతలకు పాల్పడుతున్నది?
4. ఉత్తరాది రాష్ర్టాల్లో బుల్డోజర్ న్యాయం నడుస్తున్నది. అది తప్పని సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులిచ్చాయి. కారణం సర్కారే న్యాయం చెప్పడం! ఇప్పుడు హైడ్రా చేస్తున్నదీ అదే. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం తప్పు కాదు. కానీ ఆ పేరుతో నచ్చనివారి కట్టడాలను మాత్రమే ఇష్టారాజ్యంగా ఎట్లా కూల్చేస్తారు. కూల్చివేతకు అవసరమైన ప్రాసెస్ పాటించాలి కదా!
5. కబ్జాదారులు ఎంతటివారైనా వదిలిపెట్టే సమస్యే లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్తున్నారు. మరి అక్కడ అనేక నిర్మాణాలున్నా తెలంగాణకు చెందిన ఒక వ్యాపారవేత్త కట్టడాన్ని నోటీసులు కూడా ఇవ్వకుండా, సామాను కూడా తీసుకోనివ్వకుండా ఆసాంతం ఎందుకు కూల్చా రు? ఆంధ్రాకు చెందిన నేత కట్టడం కూల్చివేతను ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే ఎందుకు ఆపారు? మరిప్పటికైనా మంత్రులు చెప్తున్నట్టు ఈ ప్రభుత్వం చట్టాన్ని అందరికీ ఒకేరకంగా వర్తింపజేస్తుందా? ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న అందరి నిర్మాణాలనూ మిగతావారిలాగే కూల్చేస్తుందా? 111 జీవోలో అనుమతులన్నింటినీ సమీక్షిస్తుందా?
6. అక్రమ నిర్మాణం ఎంత తప్పో, ప్రభుత్వమే పక్షపాతపూరితంగా, చట్టాన్ని ఉల్లంఘించి, అక్రమంగా కూల్చివేయడమూ అంతే తప్పు! అక్రమ నిర్మాణాలను కూలుస్తున్న నెపంతో ప్రభుత్వం చేస్తున్న అక్రమాన్ని ప్రశ్నించొద్దంటే ఎట్లా?
7. 111 జీవో పరిధిలో నిర్మాణాలకు సర్పంచుల అనుమతి చెల్లదని, పంచాయతీ కార్యదర్శి అనుమతి ఉండాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి చెప్పారు. మరి ఈ రూల్ అందరికీ వర్తింపజేస్తారా? ఎందుకంటే సన్నిహితుడి పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉందంటున్న ఫామ్హౌస్కూ అనుమతిచ్చింది సర్పంచే! కేటీఆర్ మిత్రుడి ఫామ్హౌస్కూ అనుమతిచ్చింది సర్పంచే!
ఉస్మాన్‌సాగర్ (గండిపేట) ఎఫ్టీఎల్ 1792 అడుగులు… 1790 అడుగులు. అంటే వీటికి అదనంగా వంద ఫీట్ల వరకు బఫర్‌జోన్ ఉంటుంది.
హిమాయత్‌సాగర్ ఎఫ్టీఎల్ 1763 అడుగులు. దీనికి అదనంగా వంద ఫీట్ల వరకు బఫర్‌జోన్ ఉంటుంది.
ఒక చెరువుగానీ పెద్ద జలాశయంగానీ దాని పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం పరిధిని ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) అంటారు. వర్షాలు వచ్చినపుడు, దాని పరివాహక ప్రాంతం నుంచి వరద వచ్చినపుడు అది నిండుకుండలా మారుతుందో… కొన్ని దశాబ్దాల రికార్డులను పరిశీలించి ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తారు. నగర శివారులోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట) ఎఫ్టీఎల్ను కూడా నిర్మాణ డిజైన్ సమయంలోనే నిర్ధారించారు. ఈ క్రమంలో ఇప్పుడు నీళ్లున్న ప్రాంతం మాత్రమే ఎఫ్టీఎల్ అనుకోవడానికి వీలు లేదు.
ఎగువ నుంచి వరద వచ్చే మార్గాలు మూసుకుపోవడం, గతంలో కురిసిన స్థాయిలో ఎగువన వర్షాలు లేకపోవడంతో రెండు జలాశయాలు ప్రతి ఏటా పూర్తిస్థాయిలో నిండటం లేదు. అందుకే ఇప్పుడు జలాశయాల్లో నీళ్లున్న ప్రాంతాన్ని చూపి… నిర్మాణాలు దూరంగా ఉన్నాయంటే అవి నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలో లేనట్లు కాదు! ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములు ఉన్నా నీళ్లు లేనపుడు వ్యవసాయం చేసుకోవచ్చు. వచ్చినపుడు ఆ భూముల్ని వదిలివేయాలి. ఎఫ్టీఎల్ పరిధిలో సెంటు జాగాలో కూడా నిర్మాణాలు చేపట్టవద్దనేది నిబంధన.
ప్రతి నీటి వనరు బతికి బట్టకట్టాలంటే దాని పరీవాహక ప్రాంతం నుంచి అందులోకి వరద నీరు సక్రమంగా రావాలి. దీంతో పాటు అది కలుషితం కాకుండా ఉండాలి. అందుకే ప్రతి నీటి వనరు దాని విస్తీర్ణం ఆధారంగా బఫర్‌జోన్‌ను నిర్ధారిస్తారు. ఈ క్రమంలో 25 హెక్టార్లు, అంతకుమించి విస్తీర్ణంలో ఉన్న చెరువు, జలాశయాల బఫర్‌జోన్‌లో నిర్ధారణకు 30 మీటర్లను ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే జంట జలాశయాల పరిధిలో చుట్టూ ఎఫ్టీఎల్ను ఆనుకొని 30 మీటర్లు (వంద ఫీట్ల) బఫర్‌జోన్‌గా ఉంటుంది. ఇక్కడ కూడా కేవలం సాగు సంబంధిత కార్యకలాపాలు మాత్రమే చేపట్టాలి తప్ప నిర్మాణాలు చేపట్టకూడదు అనేది నిబంధన.
ఒకడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నామనుకో..అన్నంలో పప్పు కలుపుకొని తింటాడు..పప్పు లాక్కున్నామనుకో..చారు కలుపుకొని తింటాడు.. అన్నమే లాక్కున్నామనుకో..వాడు కంగారుపడి అటూఇటూ చూస్తాడు.. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి…వాడు ఎగిరి గంతేసి..పనిని..చికెన్ బిర్యానీని మరచిపోయి మన దగ్గర బానిసలా పడి ఉంటాడు.
బిల్లు పాసవ్వాలని ఉందా? అయితే ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను అందులోంచి మినహాయించు.. ఎవరు చెప్పారయ్యా నీకు మా మీదే ఎంక్వైయిరీలు వేయించుకోవడానికి మేమే చట్టాలు చేయాలా? నేను చెప్పినట్లు చేయి..బిల్లు పాసైపోద్ది..
పరిధి దాటిన హైడ్రా
గత నెల 19వ తేదీన హైడ్రా ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (జీవో 99) జారీ చేసింది. అందులో స్పష్టంగా ‘పరిధి’ని పేర్కొంది. అవుటర్ రింగు రోడ్డును సరిహద్దుగా నిర్ధారిస్తూ.. అందులోకి వచ్చే పట్టణ, గ్రామీణంలోని స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీల పేర్లను కూడా పొందుపరిచింది. అయితే జంట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధుల్లో ఉన్నాయంటూ ఈ నెల 18వ తేదీన హైడ్రా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌తో పాటు మొయినాబాద్ మండలంలోని అప్పోజీగూడ, చిలుకూరు, హిమాయత్‌నగర్ పరిధుల్లో పలు భారీ నిర్మాణాలను కూల్చివేసింది.
వాస్తవానికి ఈ గ్రామాలన్నీ అవుటర్ రింగు రోడ్డు బయట ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఉత్తర్వుల్లో పొందుపరిచిన పరిధిని దాటి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఖానాపూర్ అంటే అవుటర్ లోపల ఉన్న నార్సింగి మున్సిపాలిటీ పరిధి అని సమర్ధించుకుంటున్నారు.
కానీ అప్పోజీగూడ, చిలుకూరు, హిమాయత్‌నగర్ వేటికవే స్వతంత్ర గ్రామపంచాయతీలతో పాటు అవుటర్ వెలుపల ఉండటంతో హైడ్రా అడుగులపై అనుమానాలు మొదలయ్యాయి. అవి అక్రమ నిర్మాణాలే కావచ్చుగానీ హైడ్రా ఎందుకు పరిధి దాటి వాటిని కూల్చివేయాల్సి వచ్చిందనేది సామాన్యుడిలోనూ సందేహాన్ని రేకెత్తించింది. అదే రాజకీయ మలుపునకు కారణమైంది.