Revanth Reddy | ఆదిలాబాద్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): రోడ్లపై జనం బాజాప్తా తమను తిడుతున్నరని అయినా ఏ ఒక్కరిపై కేసులు పెడుతలేమని, సతాయిస్తలేమని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని పిప్పిరిలో జరిగిన ‘ప్రజా పాలన-ప్రగతి నివేదిక’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తమ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందంటూ ఆయన పరోక్షంగా ఒప్పుకొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలో సరిహద్దులు మార్చే అవకాశం లేదని ప్రకటించారు. సభలో కొందరు నాయకులు మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల గురించి మాట్లాడారని కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 2027 మార్చి 31 వరకు మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆ కాల పరిమితి ముగిసిన తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడీషియల్ కమిషన్ వేస్తుందని, ఇలాంటి సమస్యలు పరిష్కరించడంతోపాటు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించిన విధంగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.
తన ప్రసంగంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి మరోసారి ‘చావు’ వ్యాఖ్యలు చేశారు. కొంతమందికి తాము చేస్తున్న అభివృద్ధి నచ్చడం లేదని, గ్రామాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి సీతమ్మను చెరపట్టాలనుకుంటే చివరికి రాముడి చేతిలో చావు తప్పలేదని ఆగ్రహంతో వ్యాఖ్యానించారు. అధికారిక సభలో అభివృద్ధిపై మాట్లాడాల్సింది పోయి చావు వ్యాఖ్యలు చేయడంపై జనం చర్చించుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో సమస్యల పరిష్కారం దిశగా సీఎం స్పందిస్తారని ఆశించిన ప్రజలకు ఆయన మరోసారి మొండి‘చెయ్యి’ చూపారు. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి తిరిగి పాతపాటనే పాడారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని, యూనివర్సిటీ నిర్మాణానికి భూ సేకరణ జరుపుతామని తెలిపారు. అయితే స్థానిక నేతల సూచనలను పట్టించుకోకుండా పాత హామీలనే వల్లె వేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు
పిప్పిరి సభకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వందలాది మందిని తరలించేందుకు ఆర్టీసీ బస్సులు , ఇతర వాహనాలను ఏర్పా టు చేశారు. మరోవైపు సభకు వచ్చిన వారికి భోజనం మాట అటుంచి ఎలాంటి తాగునీటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో ఎండకు తాళలేక సభకు వచ్చిన వారంతా అసహనం వ్యక్తంచేశారు. భట్టి మాట్లాడుతుండగానే జనం సభ నుంచి వెళ్లిపోవడం కనిపించింది.
తన మనుమడి అక్షరాభ్యాసం ద్వారా జిల్లా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పానని సీ ఎం అనడంతో సభకు వచ్చిన వారంతా న వ్వుకోవడం కనిపించింది. ప్రసిద్ధి కలిగిన బాసర ఆలయానికి కొత్తగా పేరు తేవడం ఏంటని చర్చించుకున్నారు.
నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బాసరకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, నాయకులు స్వాగతం పలికారు. రూ.225 కోట్ల పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి భూమిపూజ చేశారు. అలాగే ముథోల్‌కు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు అక్కడే శంకుస్థాపన చేశారు. అలాగే తన మనవడికి సీఎం రేవంత్‌రెడ్డి అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.ఏది నిజం?హామీల అమలుకు సమయం పడుతుంది
పిప్పిరి ప్రజాపాలన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు సమయం పడుతుందని చెప్పారు. పెండ్లి అయ్యాక పిల్లలు పుట్టేందుకు తొమ్మిది నెలల సమయం పడుతుందని, కండలు తిరిగి ఆరడుగులు ఉన్నోడికైనా మూడు నెలలకే పిల్లలు పుట్టరంటూ ఓ వ్యంగ్య ఉదాహరణ చెప్పుకొచ్చారు.
– సీఎం రేవంత్‌రెడ్డి
99శాతం హామీలు అమలు చేశాం
పిప్పిరి ప్రజాపాలన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ 99 శాతం అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఇది ప్రజా ప్రభుత్వమని ఊదరగొట్టారు.
– డిప్యూటీ సీఎం భట్టి
హామీల అమలుపై సభలో సాక్షాత్తూ సీఎం, డిప్యూటీ సీఎంలు విరుద్ధ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. హామీల అమలును అటకెక్కించి, ప్రజా సంక్షేమాన్ని మరచిన సర్కార్ ఇదేనని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానించడం కనిపించింది.