Revanth Reddy | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): గత 15 నెలలుగా ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం నెలవారీ అప్పులు చేయాల్సి వస్తున్నది. అందుకే నామోషీ పడకుండా ఉన్నది ఉన్నట్టు మీ ముందు ఉంచుతున్నా, ప్రభుత్వం చేతనైన కాడికి చేస్తది.. ఆర్టీసీ కార్మికులు ఈ వాస్తవాన్ని గుర్తించి సమ్మె యోచనను వీడాలి. పంతాలు, పట్టింపులకు వెళ్లవద్దు.. అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులను విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని ఒప్పుకున్నారు.
మేడే సందర్భంగా గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ కనీస వేతన సలహామండలి చైర్మన్ జనక్‌ప్రసాద్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేదని, ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థను గట్టేక్కిస్తున్నామని, ఆర్టీసీ లాభాలబాటలో పయనిస్తున్నదని చెప్పారు.
ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రేరేపితంతో సమ్మె బాట పడితే మొత్తం ఆర్టీసీ సంస్థనే దెబ్బతింటుందని హెచ్చరించారు. ఆర్టీసీలో ఏదైనా సమస్య ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించాలని, ప్రభుత్వం చేయగలిగింది చేస్తుందని చెప్పారు. కార్మిక సంఘాల నాయకులకు నా విజ్ఞప్తి ఒక్కటే, రాష్ర్టానికి వచ్చే ఆదాయ లెక్కలన్నీ మీ ముందే ఉంచుతా.. ఏ పథకం ఆపాలో.. ఏ పథకం ఆపకూడతో మీరే చెప్పండి అని కోరా రు. ఇంకో సంవత్సరం అయితే కుదురుకుంటామని చెప్పారు. నా మాట నమ్మాలని, కార్మికులకు ఇచ్చిన మాటను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. అనంతరం కార్మికులకు శ్రమశక్తి అవార్డులను ప్రదానం చేశారు.