హైదరాబాద్ : పోలీసు నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు, వైద్యారోగ్య శాఖలో నియామకాలపై డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను అత్యంత పారదర్శకంగా జరపాలని.. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియామకాల ప్రక్రియలో ఉన్న లోటుపాట్లు, వాటిని వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై కూడా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధ్యమైనంత తొందరగా పోలీసు ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు
విధి నిర్వహణలో తీవ్ర పని ఒత్తిడి, ఎక్కువ సమయం విధులు నిర్వహించే పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు, ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుంచి కండక్టర్, కింది స్థాయి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ఈ పాఠశాల ఉండాలని సూచించారు. ఉత్తర, దక్షణ తెలంగాణలో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.