హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోగా.. ఉన్న పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఉచిత పథకాలను రద్దుచేసే దిశగా ఆయన ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నది. ‘ది ప్రింట్’ ఆదివా రం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉచితాలను రద్దు చేయాలనే విధంగా వ్యాఖ్యలు చేశారు. ‘వృథా ఖర్చును నివారించడం కూడా ఆదాయాన్ని సంపాదించడమే. అవసరం లేకున్నా ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం. అందుకు వృథా ఖర్చును తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి ఉదాహరణ.. హైదరాబాద్. ఇక్కడ కోటి మంది ప్రజలు నివసిస్తున్నారు.
ఇక్కడ కేసీఆర్ ఉచితంగా తాగునీళ్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు నీళ్లు ఇచ్చి పైసలు వసూలు చేసుకునేది. ఇప్పుడు వాటర్ బోర్డుకు పైసలు రా వడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల వెనుక మరేదో ఉద్దేశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత పథకాలకు పెడుతున్న ఖర్చు వృథా అన్నట్టు ఆయన వ్యాఖ్యలున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌లో పేద కుటుంబాలకు ప్రతి నెల 20వేల లీటర్ల వరకు తాగునీళ్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. రేవంత్ వ్యాఖ్యల ప్రకారం ఈ పథకాన్ని ఎత్తేసే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
పాలన ఎలా చేయాలో చంద్రబాబు నుంచి నేర్చుకున్నా..
సీఎం రేవంత్‌రెడ్డి తన గురువు, ఏపీ సీఎం చంద్రబాబును మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు. దేశంలోనే ఆయన ప్రొగ్రెసివ్ లీడర్ అని కితాబిచ్చారు. అధికారులతో ఎలా పని చేయించుకోవాలనే విషయాలను నేర్చుకున్నట్టు తెలిపారు. ఇక మోదీ స్థానంలో ప్రధానమంత్రిగా మీరు ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఏ విధంగా ఎదుర్కొనే వారని ప్రశ్నించగా.. అసలు ఆయన్ను లెక్క చేసే వాడిని కాదని సమాధానమిచ్చారు.