Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): హైడ్రా కూల్చివేతలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం, తమకే కాకుండా అధిష్ఠానం పెద్దలకు కూడా చెప్పకుండా హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చివేయడంపై తనను ప్రశ్నించిన మంత్రులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. అంతేకాదు, ‘అన్నీ అధిష్ఠానానికి చెప్పి చేయాల్నా’ అని ధిక్కార స్వరం వినిపించినట్టు సమాచారం. ఈ విషయం కూడా అధిష్ఠానానికి చేరడంతో తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పెద్దలు రేవంత్‌ను పిలిపించినట్టు తెలిసింది. అందుకనే ఆయన ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పేదల ఇండ్లను హైడ్రా బుల్డోజర్లతో తొక్కిస్తున్న రేవంత్‌రెడ్డిపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు శాపనార్థాలు పెడుతుంటే చివరికి సొంత పార్టీ అధిష్ఠానం, మంత్రులు సైతం రేవంత్ చర్యల్ని సమర్థించడం లేదు. ఇందులో భాగంగానే సీఎంను ఢిల్లీకి పిలిచిన కాంగ్రెస్ పెద్దలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా, ఇక్కడి మంత్రులేమో సీఎంపై మాటల దాడికి దిగినట్టు తెలిసింది. అసలు ఈ హైడ్రా ఎందుకు? ఈ కూల్చివేతలు ఏమిటంటూ నిలదీసినట్టు సమాచారం. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంగా ఉంటే, ఇప్పుడు ఈ కూల్చివేతలతో పార్టీ, ప్రభుత్వం ఏం కావాలని నిలదీసినట్టు తెలిసింది. నీ ఒక్కడి వల్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి కూల్చివేతల పార్టీగా పేరొస్తున్నదని, ఇంతవరకు చేసింది చాలని, ఇక ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిట్టు తెలిసింది.
సెప్టెంబర్ 20న ప్రభుత్వం క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. దీని ఎజెండా పైకి ఒక విధంగా చెప్పగా లోపల మాత్రం హైడ్రానే ప్రధాన అంశంగా చర్చ జరిగినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డిపై పలువురు సీనియర్ మంత్రులు మాటల దాడికి దిగినట్టు సమాచారం. హైడ్రాపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు సై అంటే సై అనేదాకా వెళ్లినట్టుగా సమాచారం. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి లేచి అసలు హైడ్రా ఎందుకు?, ఈ కూల్చివేతలు ఎందుకని నిలదీసినట్టు చెప్తున్నారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టుకొని బుద్ధి ఉన్నవాడెవడైనా పేదల ఇండ్ల కూల్చివేతలు పెట్టుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని, రుణమాఫీ చేయలేదని పార్టీపై, ప్రభుత్వంపై జనాలు పీకల్లోతు కోపంతో ఉన్నారని, ఈ తలనొప్పి సరిపోదన్నట్టు ఈ కూల్చివేతల గోల ఏంటని నిలదీసినట్టు సమాచారం. అసలు ఏ ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేశారు? ఏం చేయదలుచుకున్నారో చెప్పాలని సీఎంను ప్రశ్నించినట్టుగా తెలిసింది. దీనిపై సీఎం స్పందిస్తూ మీరెందుకు అంతలా బాధపడుతున్నారని మంత్రిని ఉద్దేశించి అన్నట్టు చెప్పుకొంటున్నారు. దీనిపై సదరు మంత్రి స్పందిస్తూ ‘హైదరాబాద్‌తో నాకు సంబంధం ఉంది. సంబంధం గల మంత్రిని కావడంతో ఈ హైడ్రా గోల ఏందంటూ చాలా మంది న న్ను అడుగుతున్నారు. నేను వాళ్లకు ఏం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి’ అని ఎదురు ప్రశ్నించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పేదోడికి ఇండ్లు ఇచ్చే పార్టీగా పేరున్న కాంగ్రెస్, ఇప్పుడు అదే పేదోడి ఇల్లు కూల్చే పరిస్థితి రావడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారట. ఎలాగూ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పరిస్థితిలో లేం, ఉన్న ఇండ్లను కూల్చివేయడం ఏంటని నిలదీసినట్టు తెలిసింది. మీరు ఇలాగే చేస్తే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వం ఏం కావాలని మంత్రి ప్రశ్నించారట.
మంత్రి ఎదురుదాడితో కంగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి సదరు మంత్రిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తూ ‘ఈ విషయం గురించి మీరు నాతో ఎప్పుడైనా మాట్లాడారా?. ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి. అంతేగానీ ఢిల్లీకి ఎందుకు మోస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. కల్పించుకున్న మరో మంత్రి అసలు హైడ్రా గురించి మీరు మాతో ఎప్పుడైనా చర్చించారా? కూల్చివేస్తున్నట్టు చెప్పారా? అసలు హైడ్రా ద్వారా ఈ పని చేస్తే ఏ విధంగా ఉంటుందనే అభిప్రాయాన్నైనా తీసుకున్నారా? మీరు మాతో మాట్లాడనప్పుడు మేము మీకెలా చెబుతాం అని అడ్డం తిరిగినట్టు సమాచారం. ముఖ్యమంత్రిని తొలుత వ్యతిరేకించి ఇప్పుడు మద్దతుగా కనిపించే ఓ దక్షిణ తెలంగాణ మంత్రి స్పందిస్తూ ‘మీరు అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య ఉండేది కాదు కదా, మీరొక్కరే నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు వీళ్లను తప్పు పడితే లాభమేంటి’ అని అన్నారట. సీఎం మాట్లాడుతూ.. తనతో ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడని మీరు.. ఈ రోజు మాట్లాడినట్టుగానే ఎప్పుడూ మాట్లాడొచ్చుగా అని అన్నట్టు తెలిసింది. ఇక్కడేమో తనతో ఏదీ మాట్లాడరని, కానీ అన్ని విషయాలను ఢిల్లీకి మోస్తారని ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. తనను వ్యతిరేకిస్తున్న దక్షిణ తెలంగాణకు చెందిన మంత్రి వైపు చూస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అన్ని విషయాలను ఢిల్లీకి మోస్తున్నారంటూ మంత్రులను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీకి అధిష్ఠానం ఉంది కాబట్టి ఇక్కడ జరిగే అంశాలను అధిష్ఠానానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉన్నదని, అందుకే అవసరమైన విషయాలను చెప్తామని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ అధిష్ఠానంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘అన్నీ వాళ్లను అడిగి చేయాల్నా. అన్నీ వాళ్లకు చెప్పే చేయాల్నా. మీరు చెబితే చెప్పుకోండి ఏమైతది? అయ్యేదేం లేదు. వాళ్లు(అధిష్ఠానం) ఏం చేస్తరు? ఏం చేయలేరు?’ అని ధిక్కార స్వరం వినిపించడంతో మంత్రులు ఒక్కసారిగా విస్తుపోయినట్టు తెలిసింది. సీఎం వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన దక్షిణ తెలంగాణ మంత్రి ఒకరు ‘అవును, అన్నీ వాళ్లకు చెప్పాల్సి అవసరం లేదు. కానీ కనీసం ఇక్కడున్న వాళ్లకైనా చెప్పాలి కదా. మాతో అయినా చర్చించాలి కదా. మనం మనం చర్చించుకొని సరైన నిర్ణయం తీసుకుంటే అధిష్ఠానానికి చెప్పాల్సిన అవసరం రాదు. కానీ ఇక్కడ ఏకపక్షంగా తప్పుడు నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుంది’ అని గట్గిగానే చెప్పినట్టు తెలిసింది. ఏదైనా ఉంటే నాకు చెప్పండి అంతేగానీ ఇది ఏం బాగాలేదు’ అంటూ అధిష్ఠానానికి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి కటువుగా మాట్లాడినట్టుగా తెలిసింది.
హైడ్రాపై క్యాబినెట్ సమావేశంలో జరిగిన రచ్చ, సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ అధిష్ఠానానికి చేరినట్టుగా తెలిసింది. దీంతో పాటు హైడ్రా వ్యవహారం రోజు రోజుకి పార్టీకి నష్టం చేస్తుండడం, హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు పర్యటనలు విజయవంతం కావడం, పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులు శాపనార్థాలు పెడుతుండడం, సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం పెరిగిపోవడంతో అధిష్ఠానం పెద్దలు రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దీంతో వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా రేవంత్‌రెడ్డిని ఆదేశించినట్టు తెలిసింది. ‘త్వరలోనే ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ మాదిరిగా కూల్చివేస్తదంటూ అక్కడి ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వెంటనే హైడ్రాను, కూల్చివేతల్ని ఆపేయండి’ అని తీవ్రస్థాయిలో హెచ్చరినట్టు తెలిసింది.
కూల్చివేతలు ఎల్లకాలం ప్రజలకు గుర్తుండవని, వచ్చే ఎన్నికల నాటికి అందరూ మర్చిపోతారంటూ రేవంత్ చెప్పడంపై అధిష్ఠానం పెద్దలు మరింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజలు అంత పిచ్చోళ్లేమీ కాదని, మరి ఇప్పుడు ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో పరిస్థితి ఏంటని ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. హైడ్రా కూల్చివేతలకు రాహుల్‌గాంధీ మద్దతు ఉన్నట్టుగా ప్రచారం చేయడంపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ చేస్తున్న బుల్డోజర్ న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని, కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా పార్టీ పాలసీకి వ్యతిరేకంగా తెలంగాణలో బుల్డోజర్ కూల్చివేతలు చేయడం ఏంటని నిలదీసినట్టు తెలిసింది. బుల్డోజర్ న్యాయాన్ని వ్యతిరేకిస్తున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలో మాత్రం బుల్డోజర్ వ్యవహారాన్ని సమర్థించినట్టు నీకు ఎవరు చెప్పారని నిలదీసినట్టు సమాచారం. ‘ఇదేమైనా ప్రాంతీయ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియదా? అలాంటప్పుడు అన్నీ మాకు చెప్పి చేయాల్నా అనే ప్రశ్న ఎందుకు వేశారు. మీరేమైనా సుప్రీం అనుకుంటున్నారా’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.