హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ర్టాన్నే అవమానించిన సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. వీరోచిత పోరాటాలు, విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానాలను, దేశ రాజకీయాలను ఒప్పించి, మెప్పించి కేసీఆర్ రాజనీతిజ్ఞతతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కించపరిచేలా రేవంత్‌రెడ్డి వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత పదేండ్లలో రెండుసార్లు 73 శాతం పీఆర్సీ (తొలిసారి 43 శాతం, మరోసారి 30 శాతం) ఇచ్చి దేశంలోనే తెలంగాణ ఉద్యోగులను అగ్రభాగాన నిలిపిన ఘనత కేసీఆర్‌దే అనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆశా వరర్లకు, అంగన్వాడీ, ఐకేపీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచడమే కాకుండా రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. కండ్ల ముందు కాంగ్రెస్ మోసం కనిపిస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉద్యోగుల పరిస్థితి మెరుగైందన్నట్టుగా సీఎం వ్యాఖ్యానించడం శోచనీయమని పేర్కొన్నారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను మోసం చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ కాదా? అని దేవీప్రసాద్ ప్రశ్నించారు.