CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి తరుచూ అడ్డగోలుగా మాట్లాడుతూ.. అడ్డంగా దొరికిపోవడంపై అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్ పూర్తిగా గాడితప్పిందని అభిప్రాయపడుతున్నారు. అసలు రేవంత్‌రెడ్డికి ఏమయ్యింది? అన్న చర్చ జరుగుతున్నది. ‘దశాబ్దకాలం తర్వాత కూడా ఈ ప్రెస్‌మీట్ గురించి చెప్పుకుంటారు. అంతటి ప్రా ధాన్యం ఉన్న సమావేశం ఇది’ అంటూ సీఎం మాట్లా డే ముందు వ్యాఖ్యాత గొప్పగా చెప్పుకొచ్చా రు. కన్సార్షియం ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరుకావడంతో మూసీ ప్రాజెక్టుపై అనుమానాలన్నీ నివృత్తి చేస్తారని, ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరిస్తారని అటు పార్టీ వర్గాలు, ఇటు ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం నీరసంగా మొదలు పెట్టడం, ‘మీరు కాదంటే ప్రాజెక్టు ఆపేస్తా’ అంటూ పదేపదే మీడియా ప్రతినిధులపైకి నెట్టడంతో అందరూ కంగుతిన్నారు.
ఆ తర్వాత ప్రసంగంలో మూసీ పుట్టుక, పేరు మొదలు ప్రతి అంశంలోనూ అవగాహన లేమితో మాట్లాడినట్టు కనిపించడంతో పూర్తిగా నీరుగారిపోయారు. ముఖ్యంగా లక్షన్నర కోట్లు ఎవరన్నారు?, మూసీ సుందరీకరణ అని ఎవ రు చెప్పారు? అంటూ సీఎం వేసిన ప్రశ్నలు బూమరాంగ్ అయ్యి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అయిన సంగతి తెలిసిందే. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు కూడా సీఎంకు గుర్తుకు లేకపోవడం ఏమిటన్న ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రిపరేషన్ లేకుండా ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుతారని కాంగ్రెస్ నేతలే ప్రశ్నిస్తున్నా రు. సీఎం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో జాగ్రత్తగా మాట్లాడాల్సింది పో యి, ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను గుడ్డిగా నమ్మడం ఏమిటని చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లో సమతామూర్తిని నిర్మించిన విషయాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకునే వ్యవస్థ సీఎంవోలో గానీ, సీఎం పీఆర్వోల్లో గానీ లేకపోవడం ఏమిటని మండిపడుతున్నారు. చు ట్టూ ఉన్నవాళ్లే సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌పై సోషల్ మీడియాలో రెండో రోజూ ట్రోలింగ్ నడిచిం ది. ఆయన పాత, కొత్త వీడియోలను జత చేసి ‘ఆయనకు ఆయనే కౌంటర్ ఇచ్చుకున్నారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అడ్డంగా దొరికిపోయిన సందర్భాల వీడియో క్లిప్పింగ్‌లు జోడిస్తూ వైరల్ చేస్తున్నారు.
మూసీపై మీరెందుకు మాట్లాడరు?
మూసీ ప్రాజెక్ట్ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తమంట పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్ విఫలం కావడం, మరింత వ్యతిరేకత మూటగట్టుకోవడంతో సీఎం రేవంత్‌రెడ్డి మరింత ఫ్రస్టేషన్‌కు గురైనట్టు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నది. అందుకే శుక్రవారం పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనలేదని తెలుస్తున్నది. ‘మూసీపై నేనొక్కడినే మాట్లాడాలా?.. మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’ అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మూసీ అంశంలో ప్రభుత్వంపై దాడి చేస్తుంటే ఎదురుదాడి ఎందుకు చేయడం లేదని రుసరుసలాడినట్టు సమాచారం. ఇకపై మంత్రులు, ఎంపీలు, నేతలు ఎదురుదాడికి దిగాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. శుక్రవారం మంత్రులు దామోదర రాజనర్సింహ, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రెస్మీట్లు పెట్టారని పేర్కొంటున్నారు. కాగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రెస్‌మీట్ శనివారానికి వాయిదాపడింది. కాగా, ఎదురుదాడి చేయాలన్న ఆదేశాలపై కొందరు మంత్రులు సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చర్చ జరుగుతున్నది. మూసీ ప్రాజెక్టును మొదటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి తన ఖాతాలో వేసుకున్నారని, ఇప్పుడు వ్యతిరేకత వచ్చాక తాము గుర్తుకొచ్చామా? అని గుర్రుగా ఉన్నట్టు తెలిసింది.