(గుండాల కృష్ణ-మ్యాకం రవికుమార్) : హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ అని ఊరికే అనలేదు… నిష్ఠూరంగా ఉన్నా ఇది నిజం. బయటోడు మనల్ని మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తే వెంటనే పసిగట్టి తిప్పి కొట్టొచ్చు. కానీ, ఇంటోడు మిలాఖతైతే గొంతు తెగేవరకూ గుర్తించలేం. సమైక్య రాష్ట్రంలో ఆరు దశాబ్దాలపాటు నదీజలాల్లో నమ్మించి… తడిబట్టతో తెలంగాణ రైతాంగం గొంతు కోసిన అదే ‘గుంపు’ మళ్లీ జలద్రోహానికి సిద్ధమైంది. ఈసారి ఏకంగా ఢిల్లీ పాలకులను కలుపుకొని చారిత్రక అన్యాయానికి వడివడిగా అడుగులు వేస్తున్నది. కాకపోతే మన బంగారం మంచిది కానపుడు ఊరోళ్లను అని ఏం లాభం? అన్నట్టు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ జలద్రోహం తెలిసినా… తెల్వనట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుండటంతో చివరకు తెలంగాణ కొంప నట్టేట మునగనే మునిగింది.
నిన్నటిదాకా బనకచర్ల… ఇప్పుడు నల్లమలసాగర్… ఇది పేరు మార్పు కాదు! తెలంగాణ సమాజాన్ని కొంతకాలం దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ సర్కార్‌తో కలిసి మోదీ-చంద్రబాబు ధ్వయం ఆడుతున్న నాటకమని ఇప్పుడు తేలిపోయింది. మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ కుట్రను బట్టబయలు చేయడంతో తేలిన, తీవ్ర ఆందోళన కలిగించే అంశమేమిటంటే.. గోదావరిలో కేవలం పదేండ్లలో వచ్చిన ఇన్‌ఫ్లో లెక్కలు అందునా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డాటాతోనే బనకచర్లకు అనుమతుల ప్రక్రియ కొనసాగుతుండటం తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతంగా పరిణమించనున్నది. పైగా చంద్రబాబు చెప్తున్న వృథా లెక్కల ప్రకారం గోదావరిలో వరద లేనట్లయితే ఎగువ రాష్ర్టాలకు నీటి హక్కులకే ఎసరు పడుతుందని స్వయానా కేంద్ర జల సంఘమే హెచ్చరిస్తున్నది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో తెలంగాణ గోదావరి ప్రాజెక్టుల అనుమతులకు బనకచర్ల లింకు పెనుముప్పుగా పరిణమించనున్నది. అయినప్పటికీ ఐదు నెలల క్రితం సీడబ్ల్యూసీ ప్రాథమిక నివేదిక వచ్చినా అందులోని ఈ ద్రోహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఎత్తిచూపడం లేదు? ఢిల్లీకి పోయి సంతకం చేసి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఐదు నెలలపాటు ఆంధ్రప్రదేశ్ కుట్రలను తిప్పికొట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారు? అసలు ఏపీ సాగిస్తున్న గోదావరి జలాల మళ్లింపును అడ్డుకునేందుకు కొన్నిరోజుల క్రితం సుప్రీంకోర్టులో కేసు వేసిన తెలంగాణ ప్రభుత్వం..
20 రోజులు గడువక ముందే బనకచర్లపై కమిటీకి పేర్లు ఎందుకు పంపింది? అదీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ పేర్లు పంపిన వారం రోజుల్లోనే ఈ జాబితాను పంపాల్సిన అవసరమేమొచ్చింది? నిన్నటికి నిన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 45 టీఎంసీలు కోత పెట్టి కేవలం 45 టీఎంసీలు చాలునని రాజీపడిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏపీ 200 టీఎంసీల గోదావరి జలాలను తన్నుకుపోతుంటే సుప్రీంకోర్టు కేసుకే పరిమితమై ఎందుకు మౌనం వహిస్తున్నది? ఇంతకీ, ప్రధాని మోదీతో కలిసి చంద్రబాబు-రేవంత్ ద్వయం తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారు?! నిత్యం తెలంగాణ నదీజలాలను కొల్లగొట్టేందుకు కాపుకాసి కూర్చునే ఏపీ సీఎం చంద్రబాబు పెట్టిన బనకచర్ల చిచ్చును విజయవంతంగా నీళ్లు పోసి ఆర్పివేశామన్న తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలు ఒట్టి బూటకమని మరోసారి తేలిపోయింది. కేవలం తెలంగాణ ప్రజలను నమ్మించి… మభ్యపెట్టేందుకు ఇన్నాళ్లూ బనకచర్ల వివాదాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్టు స్పష్టమవుతున్నది.
ఎందుకంటే, ఈ ఏడాది మే నెలలో చంద్రబాబు బనకచర్ల కుంపటిని రాజేసినప్పటి నుంచి నేటిదాకా ఎక్కడా ఈ రావణకాష్ఠం ఆగకుండా మండుతూనే ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు రెండు రోజుల కిందట బయటపెట్టిన కేంద్ర జల సంఘం ప్రాథమిక నివేదిక ద్వారా అర్థమవుతున్నది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నదనేది కూడా ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. ప్రధానంగా తెలంగాణ నికరజలాల కేటాయింపులకే ఎసరు పెట్టేలా కేంద్ర జల సంఘం ప్రాథమిక నివేదికలోని అంశాలు ఉన్నాయంటే అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మొద్దు నిద్ర నటిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ఒక్కసారి అనుమతి వస్తే తెలంగాణకు చారిత్రక అన్యాయమే
కేంద్ర జల సంఘం కేవలం పదేండ్ల లెక్కలను ఆధారంగా చేసుకోవడమంటే అన్ని నిబంధనలను బుల్డోజ్ చేసి, ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసి, తద్వారా అక్కడినుంచి తమిళనాడు కావేరీకి గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు భారీ కుట్రను రచించిందని సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. ప్రధానంగా కేంద్ర జల సంఘం తన నివేదికలో చంద్రబాబు పాడుతున్న వృథాజలాలనే పరోక్షంగా బలపరిచినట్టుగా అర్థమవుతున్నది. కేంద్ర జల సంఘం దగ్గర దశాబ్దాల డాటా ఉండగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డాటా ఆధారంగా బనకచర్ల అనుమతులను పరిశీలించడమే కుట్రను బలపరుస్తున్నది. దీని వెనుకా బలమైన కారణమున్నట్టు స్పష్టమవుతున్నది. గతంలో ఎన్‌డబ్ల్యూడీఏ చేపట్టిన సర్వేల్లోనే గోదావరిలో మిగులుజలాలు లేవని అధికారికంగా తేలిందని నివేదికల్లోనే స్పష్టంచేశారు.
దీంతో కేంద్ర జల సంఘం దగ్గర ఉన్న డాటాను పరిశీలిస్తే మిగులుజలాలు అనేవే ఉండవు. అందుకే ఆ డాటాను కాకుండా కేవలం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన డాటాను పరిగణనలోకి తీసుకుంటున్నారు. మరోవైపు, కేంద్ర జల సంఘం ఇచ్చిన బనకచర్ల లింకు ప్రాథమిక నివేదికలో ఆయా సందర్భాల్లో పోలవరం దిగువకు పారుతున్న 790, 418 టీఎంసీలు దిగువన అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నది. అంటే అందులో ఎగువ రాష్ర్టాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు హక్కుభుక్తంగా వచ్చిన నీటి వాటాలు కూడా ఉన్నాయి. ఈ మేరకు ఆయా రాష్ర్టాల ప్రాజెక్టులకు అనుమతులు రావడంతోపాటు ఇంకా కొన్ని ప్రాజెక్టులను నిర్మించుకోవాల్సి ఉన్నది. అలాంటప్పుడు పోలవరం దిగువకు పోయిన నీళ్లన్నీ వృథాజలాలే అని సీడబ్ల్యూసీ ఎలా సూత్రీకరిస్తుందని నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. దీంతోపాటు నివేదికలో పోలవరం వద్ద చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాస్తవానికి ఆ పథకాలకు ఎలాంటి అనుమతులు లేవు.
అయినప్పటికీ, కేంద్ర జల సంఘం అధికారికంగా వాటిని రికార్డుల్లో పొందుపరచడమంటే ట్రిబ్యునల్స్‌కు వ్యతిరేకంగా ఏపీకి హక్కులు కల్పించడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, పోలవరం దిగువన కీలకమైన చారిత్రక ధవళేశ్వరం బరాజ్ ఉంది. ఇక్కడ కనీసంగా ఏటా 250-300 టీఎంసీల నీటి వినియోగం ఉంటుంది. కానీ, కేంద్ర జల సంఘం దానిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ఇలాంటి గుడ్డి లెక్కలపై బనకచర్ల లింకుకు అనుమతినిచ్చినట్లయితే భవిష్యత్తులో తెలంగాణతోపాటు ఎగువ రాష్ర్టాల ప్రాజెక్టులకు అనుమతినిచ్చే క్రమంలో కేంద్ర జల సంఘం బనకచర్ల నీటి కేటాయింపులకు విఘాతం కలుగకుండా అనే నిబంధనను పెట్టే ముప్పు పొంచి ఉన్నది. అంటే తెలంగాణ సహా ఇతర బేసిన్ రాష్ర్టాలు చేపట్టే, అనుమతులు కోరే ప్రాజెక్టులన్నింటికీ బనకచర్ల ద్వారా ఏపీ తరలించుకుపోయే 200 టీఎంసీలతోపాటు ధవళేశ్వరం కింద వాడే 250-300 టీఎంసీలకు అధికారికంగా రక్షణ కల్పించిన తర్వాతనే అనుమతులు ఇస్తుందన్నమాట. ఇదే జరిగితే తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతులు వచ్చే అవకాశాలుండవని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఐదు నెలల మౌనం దేనికి సంకేతం?!
చంద్రబాబు బనకచర్ల లింకు ప్రాజెక్టును దిగ్విజయంగా నిలిపివేయించామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నది. కానీ, జూలైలోనే కేంద్ర జల సంఘం ప్రాథమిక నివేదిక ఇచ్చిన తర్వాత ప్రాజెక్టుపై కసరత్తు ఎక్కడ నిలిచిపోయిందో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ముఖ్యంగా అసలు బనకచర్లనే ముందుకు పోవడంలేదని, తమను కాదని కేంద్రం ఏమీ చేయదని స్వయానా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనేకసార్లు మీడియా ముందు ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో జూలైలో కేంద్ర జల సంఘం ప్రాథమిక నివేదిక ఇచ్చినా ఐదు నెలలపాటు మౌనం వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి బనకచర్లను అడ్డుకునే చిత్తశుద్ధి ఉంటే సీడబ్ల్యూసీ ప్రాథమిక నివేదికపైనే అభ్యంతరాలను వ్యక్తంచేయాలి.
తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ఏపీ ఇచ్చిన పదేండ్ల డాటాతో 200 టీఎంసీల గోదావరిజలాల మళ్లింపు సాధ్యమని ఎలా తేల్చారని ప్రశ్నించాలి. గతంలో తెలంగాణ గోదావరి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే క్రమంలో ఎగువన మహారాష్ట్ర నీటి వాటాలను లెక్కించి హైడ్రాలజీ అనుమతులు ఇచ్చింది. గతంలో తమ్మిడిహట్టి… కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ విషయంలో ఎగువన మహారాష్ట్ర హక్కుగా 63 టీఎంసీల వాటా ఉన్నదని, దానిని మినహాయించే నీటి లభ్యతను కేంద్ర జల సంఘం లెక్కించింది. ఈ క్రమంలో బనకచర్ల విషయంలోనూ ఎగువ రాష్ర్టాల నీటి హక్కులను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడంలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖలు రాయాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రేక్షకపాత్ర వహించిందంటేనే చీకటి ఒప్పందానికి బలాన్ని చేకూర్చినట్టవుతుంది.
కమిటీకి పేర్లు పంపేందుకే సుప్రీంకోర్టులో దావానా?
అసలు బనకచర్ల ముందుకు పోతలేదన్నరు… జూలైలో వచ్చిన ప్రాథమిక నివేదికపై ఐదు నెలలు మౌనం వహించారు… కానీ, ఉన్నపళంగా గత డిసెంబర్ నాలుగో తేదీన సుప్రీంకోర్టులో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బనకచర్లపై కేసు వేసింది. ఒకవైపు ప్రాజెక్టు నిలిచిపోయిందన్న ప్రభుత్వం ఎందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించిందనే దానిపై అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, రోజుల వ్యవధిలోనే అసలు గుట్టురట్టయింది. బనకచర్లపై గతంలో కేంద్రం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సంతకం చేసి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం వేసిన కమిటీకి పేర్లు పంపుతామని అంగీకరించినట్టు తెలుస్తున్నది. ఆ మేరకు గతంలోనే పేర్లు పంపాల్సి ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి, తెలంగాణ సమాజం నుంచి వస్తున్న వ్యతిరేకతతో వ్యూహాత్మక మౌనాన్ని వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈలోగా ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్లను మరిపించి, ప్రజల దృష్టిని మరల్చేందుకు నల్లమలసాగర్‌ను తెరపైకి తెచ్చారు. దీంతో అసలు బనకచర్లనా? నల్లమలసాగరా? అనే చర్చ మొదలైంది. అంతర్గతంగా మోదీ ప్రభుత్వం బనకచర్ల అనుమతుల కోసం కసరత్తు చేస్తూనే ఉన్నది. ఇక, కేంద్రం వేసిన కమిటీతో ముందుకు పోవాల్సిన అవసరం రావడంతో రెండు రాష్ర్టాలు కమిటీకి పేర్లు పంపేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకు ముందుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టేందుకు నామమాత్రంగా సుప్రీంకోర్టును ఆశ్రయించిందనే విమర్శలు వస్తున్నాయి. ఎప్పుడైతే తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో కేసు వేసిందో… పదకొండు రోజుల్లోనే అంటే గత డిసెంబర్15వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ తరఫున కమిటీకి పేర్లు ప్రతిపాదించింది.
దీని తర్వాత వారం రోజుల వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 23న ఆదిత్యానాథ్‌దాస్ సహా పలువురు పేర్లను కేంద్రానికి పంపింది. అంటే కమిటీకి పేర్లు పంపాలని గతంలోనే నిర్ణయించుకున్న ప్రభుత్వం తొలుత సుప్రీంకోర్టులో కేసు వేసి ఆపై కమిటీకి పేర్లు పంపింది. వాస్తవంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడమంటేనే కేంద్రం మీద నమ్మకం లేక న్యాయపరంగా తేల్చుకుంటామని అర్థం. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కమిటీకి పేర్లు పంపాల్సిన అవసరమేముందనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అంటే సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతుండగానే… కేంద్రం బనకచర్లపై చేసే కసరత్తుకు ఎలాంటి ఆటంకం లేకుండా కమిటీని ముందుకు తీసుకుపోయేందుకు రేవంత్ ప్రభుత్వం పేర్లు పంపిందని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
పదేండ్ల డాటాతోనే బనకచర్లకు రూట్‌క్లియర్
కేంద్ర జల సంఘం గత జూలైలో పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రాథమిక నివేదిక రూపొందించింది. అంటే సూత్రప్రాయంగా 200 టీఎంసీల గోదావరిజలాల మళ్లింపునకు మార్గాన్ని సుగమం చేసింది. అయితే ఇందులో అత్యంత కీలకమైన విషయం… గోదావరి నదిలో కేవలం గత పదేండ్లలో (1980-81 నుంచి 2022-23 వరకు) వచ్చిన ఇన్‌ఫ్లో లెక్కలను ఆధారంగా చేసుకొని ఈ నివేదిక రూపొందించడం గమనార్హం. వాస్తవానికి గతంలో కేంద్ర జల సంఘం ఏ ప్రాజెక్టుకు అనుమతులిచ్చే ప్రక్రియలోనైనా కనీసంగా వందేండ్ల ఇన్‌ఫ్లో వివరాలను ఆధారంగా చేసుకొని హైడ్రాలిక్ అనుమతులు ఇచ్చింది. కానీ, బనకచర్ల లింకులో మాత్రం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పదేండ్ల డాటాను ప్రామాణికం చేసుకోవడమే అసలు కుట్రకు మూలం. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారం కేంద్ర జల సంఘం చెప్తున్న విషయాలు ఇవి…
జీబీ లింకు పరిణామాలు