హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం రాజభవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. తాజాగా సీపీ రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపత్తి ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
ఇక తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. మరో రెండు రోజుల్లో జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన ఆయన.. ప్రస్తుత ఇంచార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్థానంలో రానున్నారు. రాజ కుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ 1957 ఆగస్టు 15న జన్మించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. 1990ల ప్రారంభంలో బీజేపీలో చేరారు. అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నారు. 2018-23 మధ్య ఉప ముఖ్యమంత్రిగా, త్రిపుర బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.