హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘మంత్రుల భార్యలకు చీరలు పంపిస్తే వీళ్లే కట్టుకునేలా ఉన్నారు. మంత్రి సీతక్క.. మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబాలకు అదనంగా చీరలు ఇస్తామంటే నాకేం అభ్యంతరంలేదు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని ఆమె విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా పక్కనే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ‘మంత్రుల భార్యలకు కూడా చీరలు ఇస్తారా?’ అని అడిగారు. స్పందించిన సీఎం పై కామెంట్స్ చేశారు. పక్కనే ఉన్న మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పగలబడి నవ్వారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
చీరల ఉత్పత్తి ఆలస్యమవుతున్నందున ఏటా రెండు విడతల్లో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు, పట్టణాల్లో మార్చి 1 నుంచి మార్చి 9 వరకు పంపీణీ చేస్తామని వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల్లోని కోటి మంది మహిళా సభ్యులకు ఏటా కోటీ చీరలు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మహిళా మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఇందిరమ్మ చీరలు ధరించి తెలంగాణ ఆడబిడ్డలకు స్ఫూర్తినివ్వాలని కోరారు. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ప్రకటించారు.