Revanth Reddy | హైదరాబాద్, మే 29(నమస్తే తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాటలోనే సీఎం రేవంత్రెడ్డి పయనిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా రేవంత్రెడ్డి లక్ష్యాలు కూడా మారుతున్నాయి. ఇందులో భాగంగానే ‘రైజింగ్ తెలంగాణ’ నినాదంలో మార్పులు చేశారు. నిన్న మొన్నటి వరకు కేవలం ‘రైజింగ్ తెలంగాణ’ పేరుతో ప్రచారంలో ఉన్న లోగో తాజాగా ‘రైజింగ్ తెలంగాణ-2047’గా మారింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మోదీ బాటలో నడుస్తున్న రేవంత్రెడ్డి తన ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్యాన్ని సైతం విజన్ 2047గా మార్చడం గమనార్హం. ఢిల్లీలో ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలోనూ ‘రైజింగ్ తెలంగాణ- విజన్ 2047’పై రేవంత్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ‘బడే భాయ్’ బాటలో ‘చోటే భాయ్’ అని కామెంట్లు చేస్తున్నారు. మోదీతో రేవంత్ సన్నిహితంగా ఉంటున్నారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతున్నది. ఇప్పుడు విజన్ మార్పు ఈ బంధానికి మరింత బలం చేకూర్చిందని చెప్తున్నారు.