హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణబ్రాండ్ ఇమేజ్ను సీఎం రేవంత్రెడ్డి దెబ్బతీస్తున్నారు. తన మాటలతో తెలంగాణ పతారను పలుచన చేస్తున్నారు. సమయం, సందర్భం చూడకుండా ప్రతిచోటా ‘దివాలా’కోరు వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘రాష్ర్టాన్ని అప్పుల పాలుచేశారు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వడానికి కష్టపడుతున్నాం. ఆర్బీఐ నుంచి రూ.4,000 కోట్లు చేబదులు తెస్తున్నాం.
అప్పులు, వడ్డీలకే ఏడాదికి రూ.1.58 లక్షల కోట్లు చెల్లిస్తున్నాం’ అంటూ ప్రతీ వేదికపై తెలంగాణ పరపతిని దెబ్బతీస్తున్నారు. గురువారం రవీంద్రభారతిలో ఉద్యోగులకు నియామక పత్రాలు ఇస్తూ కూడా అవే మాటలు వల్లెవేశారు. ‘ఈ రోజుకు 8 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఎట్ల.. తీసుకొచ్చి ఇయ్యాలా? ఏ అప్పూ పుడుతలేదు మార్కెట్ల.. ఎవ్వరూ మనల్ని నమ్ముతలేరు’ అని పేర్కొన్నారు.
సీఎం రాష్ట్రం దివాలా తీసిందని, తమను ఎవరూ నమ్మడం లేదని చెప్పడంతో జాతీయ మీడియా తెలంగాణపై నెగెటివ్ దాడి మొదలుపెట్టింది. ఏ జాతీయ పత్రిక, చానల్ చూసినా ‘ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ’ పేరిట కథనాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో తలసరి ఆదాయంలో టాప్లో నిలిచిన రాష్ర్టాన్ని ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలోకి పడిపోయినట్టు పేర్కొంటున్నాయి. జాతీయ మీడియా కథనాలతో రాష్ట్రంలో ఏర్పాటైన జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. మీడియా ప్రచారంతో ఆయా సంస్థలు ఇతర రాష్ర్టాలకు తరలుతున్నాయి.