CM Revanth Reddy | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలేనని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము 27 రోజుల్లో రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పారు. టెక్నికల్ అంశాలతో రుణమాఫీ జరగనివారు కలెక్టర్‌కు వివరాలు ఇవ్వాలని సూచించారు. రుణమాఫీ కానీ వారి వివరాలను మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కూడా ఇవ్వొచ్చని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.13,329 కోట్లు రుణమాఫీ చేసిందని వివరించారు. ప్రభుత్వం చేస్తున్న పనులకు, పార్టీలో చేరికలకు సంబంధం లేదని స్పష్టంచేశారు. తమకు పూర్తి మెజార్టీ ఉన్నదని, ఎవరినో భయపెట్టి చేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ విధానాలు నచ్చి వస్తే చేర్చుకుంటామని పేర్కొన్నారు.
ప్రజల ప్రయోజనం కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని రేవంత్ అన్నారు. చెరువుల్లో నిర్మాణాలు ఉంటే ఎంతటి వారైనా వదిలేది లేదని స్పష్టంచేశారు. పార్టీలతో సంబం ధం లేకుండా హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని తేల్చిచెప్పారు. ఓల్డ్ సిటీ కాదు.. ఏ సిటీ అయిన వెనకి తగ్గేదే లేదని తెలిపారు. యుద్ధ ప్రాతిపాదికన కూల్చివేతలు పూర్తిచేస్తామని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో తన కుటుంబసభ్యుల భవనాలు ఉంటే వివరాలు ఇవ్వాలని, దగ్గరుండి వాటిని కూల్చివేయిస్తానని చెప్పారు. రాజకీయ నాయకులు, సినీహీరోలు ప్రజలకు రోల్‌మాడల్‌గా ఉండాలని సూచించారు. చెరువుల కబ్జాపై నిజనిర్ధారణ కమిటీ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఈ కమిటీకి హరీశ్‌రావు నేతృత్వం వహించినా స్వాగతిస్తామని అన్నారు. చెరువు శిఖం భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, వ్యవసాయం చేసుకుంటే ఇబ్బంది లేదని తెలిపారు.
మనీశ్‌సిసోడియాకు 16 నెలల తర్వాత బెయిల్ రాగా, కేజ్రీవాల్ ఇంకా జైలులోనే ఉన్నారని, కవితకు మాత్రం 5 నెలల్లోనే ఎలా బెయిల్ వచ్చిందని ప్రశ్నించారు. తాము ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.