హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై చావు భాష, రోత కూతలు వదిలిన సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభ వేదికగా పశ్చాతాపానికి దిగారు. జనంలో పల్చనైన తీరును తుడిచేసుకునేందుకు వినయం ప్రదర్శిస్తూ స్వయంగా కేసీఆర్ దగ్గరకు వెళ్లారు. నమస్కరించి, చేయి కలుపడానికి వచ్చిన రేవంత్‌కు తాను సీనియర్, రెండుసార్లు సీఎం అనే విషయాలను కూడా పక్కనపెట్టి లేచి మరీ నిలబడి చేయి అందించారు., ప్రతి నమస్కారంతో మర్యాదపూర్వకంగా పలుకరించారు. ఇంతటి అద్భుతమైన ఘట్టం సోమవారం అసెంబ్లీ వేదికగా కళ్లముందు సాక్షాత్కరించింది.
వేదికలపై మాటజారి.. సభలో దిద్దుబాటు దిశగా
ప్రజావసరాల కోసం అక్కరున్న చోట అడిగి చేయించడం, చెప్పినా వినని వేళ కడిగిపారేయడమే నైజంగా సాగే కేసీఆర్ రెండేండ్లుగా రేవంత్ సర్కార్ చర్యలను తీక్షణంగా గమనించారు. అటు మోదీ, ఇటు ఏపీ సర్కార్ ఏకమై కృష్ణాజలాల దోపిడీకి దిగిన దుశ్చర్యను ఎండగట్టారు. జలహక్కుల సాధనలో నీళ్లు నములుతున్న కాంగ్రెస్ పాలకుల విధానాన్ని కడిగిపారేశారు. నీళ్లలా పారించిన వాస్తవ లెక్కలు, పూసగుచ్చినట్టుగా పేర్చిన మాటల ప్రవాహంతో సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుంచి కండ్లకు కట్టినట్టు చూపారు. ఉద్యమనేత అనుభవం, పదేండ్ల పాలనా దక్షతకు హడలిపోయిన సీఎం రేవంత్‌రెడ్డి నోటికి పని చెప్పాడు, బూతులు వల్లెవేశారు. వేదిక దొరికితే చాలు నోటికొచ్చిన బూతులను కక్కుతూ, ఒంటికాలిపై లేచి జనబాహుళ్యంలో పలుచనయ్యారు. స్థాయి మరిచిన సీఎం నీచభాషపై సర్వులు దుయ్యబట్టారు., మాటతీరును తప్పుబట్టారు. ఆఖరికి సొంత పార్టీ నేతలూ ముఖం చిట్లించుకున్నారు.
నక్క వినయంతో నవ్వులపాలు
శాసనసభ సాక్షిగా కేసీఆర్‌తో సీఎం మాటాముచ్చట అంతా నక్క వినయమే అని తేలడానికి ఎంతోసేపు పట్టలేదు. కేసీఆర్ హౌస్ నుంచి బయటికి వెళ్లకముందే రేవంత్ నట స్వరూపం, విడుదల చేసిన వీడియో క్లిప్పులు అతి జుగుప్సాకరంగా బట్టబయలయ్యాయి. నమస్కారానికి ప్రతి నమస్కారం, మర్యాదకు ప్రతి మర్యాదగా, చిన్నా అనే తేడా లేకుండా సీటుకు గౌరవసూచకంగా కేసీఆర్ చూపిన మంచిని కూడా రేవంత్ కుసంస్కారంతో మలిచిన తీరుపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ‘తనకు వంగివంగి దండం పెట్టాడని, తొంగితొంగి మాట్లాడాడని..’ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ట్యాగ్లైన్లు పెట్టి వైరల్ చేసిన తీరు సర్కార్ పెద్దల సోయిమాలిన తనానికి నిదర్శమని నెటిజన్లు మండిపడుతున్నారు.