‘కాళేశ్వరం కూలింది.. కాళేశ్వరం కాదది కూలేశ్వరం.. ప్రాజెక్టుతో లక్ష కోట్లు వృథా అయినయ్’.. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి కాంగ్రెస్ సీఎం రేవంత్‌రెడ్డి సహా ఆ పార్టీ నేతలు చేసిన దుష్ప్రచారమిది! ఇలా కూలింది అని ప్రచారం చేసిన ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లనే రూ.లక్షన్నర కోట్లతో చేపడుతున్న మూసీ పునరుజ్జీవన పథకం కోసం రేవంత్ సర్కారు తరలించబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల జలాలను మూసీకి మళ్లించే పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారం అంతాఇంతా కాదు. ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యాయని, కూలిపోయిందని ప్రచారం చేస్తూ దానిని ఒక విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసింది. ఘోష్ కమిషన్ వేసింది. అసెంబ్లీలో అర్ధరాత్రి కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయని ప్రకటించి సీబీఐ విచారణకు ఆదేశించింది. కానీ, ఇప్పుడు అదే ప్రాజెక్టుపై ఆధారపడి లక్షన్నర కోట్ల రూపాయల మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల జలాలను మూసీనదికి తరలించే పనులకు రేవంత్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టేందుకు సర్వం సిద్ధమైంది. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులను జలాలతో నింపేందుకు ఉద్దేశించిన గోదావరి డ్రింకింగ్ వాటర్ సీమ్ ఫేజ్-2, ఫేజ్-3 పథకానికి ముఖ్యమంత్రి సోమవారం శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే, కోకాపేట లేఅవుట్ సమగ్రాభివృద్ధి ప్రాజెక్టుకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారు. నియోపోలిస్ లే అవుట్ వద్ద ఓఆర్ఆర్ ఎగ్జిట్-1ఏపై హెచ్ఎండీఏ నిర్మించిన ఇంటర్ చేంజ్ ట్రంపెట్‌ను సీఎం ప్రారంభిస్తారు. ఇక, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను ఆ నీటితో నింపి 17.5 టీఎంసీల జలాలను తాగునీటి అవసరాలకు, 2.5 టీఎంసీలను మూసీ పునరుజ్జీవనానికి కేటాయిస్తారు.
రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుతోపాటు హైదరాబాద్ మహానగర తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మల్లన్నసాగర్ నుంచి 20 టీఎంసీల నీటిని గోదావరి తాగునీటి ప్రాజెక్టు 2,3 దశలలో తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూ. 7,360 కోట్ల ఖర్చుతో రెండు ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం 40 శాతం పెట్టుబడి వాటా పెట్టనుండగా, కాంట్రాక్ట్ కంపెనీ 60 శాతం నిధులు సమకూరుస్తుంది. ఆ పనులకు సంబంధించి గతంలోనే టెండర్లను ఆహ్వానిస్తూ జలమండలి నోటిఫికేషన్ జారీచేసింది. మేఘా, ఎల్అండ్టీ సంస్థలకు టెండర్ ఖరారు చేశారు. తాజాగా ఈ పనులకు రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. 2,3 దశలకు సంబంధించిన పైప్లైన్లను రెండు వరుసలుగా వేయనున్నారు. 3,000 ఎంఎం డయాతో రెండు పైప్లైన్లు వేసి 20 టీఎంసీల కాళేశ్వరం నీటిని మళ్లించనున్నారు. మొదటి ప్యాకేజీలో మల్లన్నసాగర్ నుంచి ఘనపురం వరకు, రెండో ప్యాకేజీలో ఘనపురం నుంచి ఉస్మాన్ సాగర్ వరకు పనులు చేపడతారు.
మల్లన్న సాగర్ నుంచి ఘనపురం వరకు నీటిని తరలించేందుకు రూ. 3,225.47 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులో మల్లన్న సాగర్ వద్ద భారీ పంప్‌హౌస్, ఎలక్ట్రోమెకానికల్ ఎక్విప్మెంట్లతో కూడిన సబ్ స్టేషన్ నిర్మిస్తారు. దీంతోపాటు ఘనపురం వద్ద 1,170 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 40 మిలియన్ లీటర్ల క్లియర్ వాటర్ రిజర్వాయర్, పంప్‌హౌస్‌లను నిర్మిస్తారు. దీనిని పదేండ్లపాటు నిర్వహించేందుకు రూ.105.48 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ రెండు కలిపి ప్రాజెక్టు విలువ రూ.3,330.95 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు.
ఘనపురం నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌కు నీటిని తరలించే రెండో ప్యాకేజీకి రూ. 2,052.72 కోట్లు అవుతుందని అంచనా రూపొందించారు. ఘనపూర్ నుంచి ఉస్మాన్ సాగర్ వరకు 2,200 ఎంఎం వ్యాసార్థంతో కూడిన పైప్లైన్లు, ఘనపురం నుంచి ముత్తంగి వరకు 2,400 ఎంఎం వ్యాసార్థపు పైప్లైన్లు, కోకాపేట నుంచి ఉస్మాన్ సాగర్, ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) వెంట 3,000 ఎంఎం డయా పైప్‌లైన్ ద్వారా నీటి తరలిస్తారని జలమండలి అధికారులు తెలిపారు. 2,200 ఎంఎం పైప్‌లైన్ ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను ఇంటర్ కనెక్ట్ చేస్తారు. వీటితోపాటు ఉస్మాన్ సాగర్ వద్ద 120 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 10 మిలియన్ లీటర్ల క్లియర్ వాటర్ పంప్‌హౌస్ నిర్మించనున్నారు. ఆధునాతన సబ్‌స్టేషన్‌ను సైతం నిర్మించనున్నారు. దీంతోపాటు గోల్డెన్ మైల్ వద్ద 22.50ఎంఎల్ మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. హిమాయత్ సాగర్ వద్ద 70 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, 18 ఎంఎల్డీ క్లియర్ వాటర్ పంప్‌హౌస్, పంపింగ్ చేయడానికి సబ్స్టేషన్లను నిర్మించి అకడి నుంచి 1,000 ఎంఎం డయా పంపింగ్ ద్వారా బుద్వేల్ రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్రణాళికలు రూపొందించారు.
గోదావరి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. ఇందులో 10 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి నుంచి మొదటి దశ ద్వారా మళ్లించి వినియోగిస్తున్నారు. రెండో దశ కింద కొండపోచమ్మ సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని మళ్లించేలా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేశవాపురం వద్ద 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించడానికి 2017 అక్టోబరులో రూ.4,777.59 కోట్లతో అప్పటి ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కాంట్రాక్టు పద్ధతిలోనే ఈ పనిని చేపట్టాలని నిర్ణయించి టెండర్ పిలిచి 2018 ఫిబ్రవరిలో కాంట్రాక్టర్‌కు అప్పగించింది. రిజర్వాయర్‌ను డిజైన్ చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థ వాప్కోస్కు అప్పగించింది. 2019 ఆగస్టులో నివేదిక ఇచ్చిన వాపోస్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని10 టీఎంసీలు కాకుండా 5.04 టీఎంసీలకు తగ్గించాలని సిఫార్సు చేసింది. దీంతోపాటు అదనంగా కొండపోచమ్మ నుంచి 10 టీఎంసీల నీటిని మళ్లించి ఘనపూర్ వద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించి సరఫరా చేయడానికి కూడా వాపోస్ సిఫార్సు చేసింది. ఈ పనులన్నింటినీ మొదట ఒప్పందం చేసుకొన్న నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్కు అప్పగిస్తూ ఇస్తూ 2020లో ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పనులు కూడా మొదలయ్యాయి. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక 2024 నవంబరు 5న కేశవాపురం వద్ద రిజర్వాయర్ నిర్మాణ పనిని రద్దుచేస్తూ ఉత్తర్వులు ఆదేశాలు జారీ చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకోవాలనే కొత్త ప్రణాళిక అమల్లోకి తెచ్చారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రస్తుతం లక్షన్నర కోట్లతో చేపట్టతలచిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కేసీఆర్ సర్కార్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టే కీలకం కానుంది. గోదావరి జలాలను మూసీలో పోయడమే ప్రాజెక్టు ఉద్దేశం. అయితే గోదావరి జలాలు ఏవిధం గా వస్తాయంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు, సొరంగాలు, పంప్‌హౌస్‌లు, భారీ కాలువలు ఇతర నీటి సరఫరా వ్యవస్థను వినియోగించుకోవడం ద్వారానే. లేదంటే గోదావరి జలాలు మూసీకి చేరడం అసాధ్యం. సూటి గా చెప్పాలంటే మూసీ ప్రాజెక్టుకు మూలం కాళేశ్వరం ప్రాజెక్టే. మరి అలాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వృథా ఎలా అవుతుం ది? లక్ష కోట్లు వృథా అని ఇంతకాలం తా ము చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు మూసీ సుం దరీకరణ ప్రాజెక్టు ద్వారా తేల్చిచెప్పింది. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ అయినా కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని ఉప ప్రాజెక్టులే. అదే కాళేశ్వరం నీళ్ల మీద ఆధారపడి హైదరాబాద్ తాగునీటి వనరులకు కాంగ్రెస్ సర్కార్ రూపకల్పన చేయడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉద్దేశపూర్వకంగానే అసత్యప్రచారాలు చేయడం తప్ప మరేమీ లేదని రేవంత్‌రెడ్డి ప్రభుత్వమే అంగీకరిస్తున్నది.