పోచమ్మమైదాన్, నవంబర్ 19: హనుమకొండలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ప్రారంభించిన కాళోజీ కళాక్షేత్రానికి కొంతమంది కవులు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఓరుగల్లుకు చెందిన కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రామాచంద్రమౌళికి ఎలాంటి ఆహ్వానం అందకపోవడంతో ఆయన ప్రారంభోత్సవానికి వెళ్లలేదు.
కళాకారులు, సాహితీవేత్తల కోసం రూ.కోట్లతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రారంభించిన కార్యక్రమానికి తమను ఆహ్వానించకపోవడంపై కవులు, రంగస్థల కళాకారులు, సాహితీవేత్తలు ఆగ్రహంగా ఉన్నారు. వరంగల్ నగరంలో దాదాపు 15 వరకు కళాసంస్థలు, ఐక్యవేదికలు, సాహితీసంస్థలు ఉన్నా వారికి చాలా వరకు ఆహ్వానాలు అందలేదని చెప్తున్నారు. ముఖ్యంగా సహృదయ, నేరెళ్ల వేణుమాధవ్, రంగస్థల కళాకారుల ఐక్యవేదిక తదితర సంస్థలను ఆహ్వానించలేదని సమాచారం. కాళోజీ ఫౌండేషన్ వారిని మాత్రమే ఆహ్వానించినట్టు తెలుస్తున్నది.
కాళోజీ కళాక్షేత్రం ప్రారంభానికి నాకు ఆహ్వానం ఇవ్వకుండా అవమానించారు. కాళోజీ నారాయణరావు అవార్డు అందుకున్న నేను.. అధికారుల నుంచి ఆహ్వానం వస్తుందని ఊహించాను. అది జరగకపోవడంతో మనసు విరిగి ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నాను. ఎలాంటి ప్రొటోకాల్ పాటించకుండా మమ్మల్ని విస్మరించారు. కాళోజీ ఫౌండేషన్ నుంచి కూడా నాకు ఎలాంటి సమాచారం అందకపోవడం బాధాకరం.
-రామా చంద్రమౌళి, ప్రముఖ కవి, కాళోజీ అవార్డు గ్రహీత
కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవానికి ఓరుగల్లులోని కళా సంస్థలకు ఆహ్వానం అందకపోవడం సిగ్గుచేటు. ఐదు దశాబ్దాల నుంచి రంగస్థల కళాకారులుగా పని చేస్తున్నాం. ఆట-పాట, ధూంధాం, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చాం. కళాక్షేత్రం విషయమై ప్రసంగించేటప్పుడు కళాకారులు, సాహితీవేత్తలు లేకపోవడం ఎంతవరకు న్యాయం? మాకు ఆహ్వానం అందకపోవడం వల్లనే దూరంగా ఉన్నాం.
-డాక్టర్ కాజీపేట తిరుమలయ్య, జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు