మొయినాబాద్, జనవరి 28: వికారాబాద్ అటవీప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్‌లో సాధారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కంటే 2 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని, అందుకే ఇక్కడ టీబీ కేంద్రాలను ఏర్పాటు చేశారని చెప్పారు. ఇక్కడికి టీబీ ఉన్న వారిని తీసుకొస్తే ఇక్కడి వాతావరణం, ప్రకృతి సహజ వనరుల వల్లే వారికి జబ్బు తగ్గుతుందని అన్నారు. త్వరలోనే పెద్ద పెద్ద పరిశ్రమలవారు ఇక్కడకు వచ్చి వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పొద్దుటూరు గ్రామంలో రామ్‌దేవ్‌రావు నూతనంగా ఏర్పాటుచేసిన ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కును పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీఎం రమేశ్, అనిల్మార్యాదవ్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మంగళవారం ప్రారంభించారు.
అంతకుముందు ఎలక్ట్రికల్ వాహనంలో వెళ్లి ఎక్స్పీరియం పార్కును తిలకించారు. ఎక్స్పీరియం పార్కు చైర్మన్ రామ్‌దేవ్‌రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం పాలసీలను తీసుకొస్తుందని తెలిపారు. వీటి వలన రాష్ర్టానికి గుర్తింపు, గౌరవంతోపాటు ఆదాయం లభిస్తుందని చెప్పారు. టూరిజం పాలసీపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే విధివిధానాలను తీసుకొస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం లేకపోవడంతో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు ప్రస్తుతం ఇతర దేశాలు, రాష్ర్టాలకు వెళ్లి శుభకార్యాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రపంచప్రఖ్యాతిగాంచిన మందిరాలు, ప్రకృతి వనరులు, నల్లమల్ల టైగర్ ఫారెస్టు, మల్లెల తీర్థం వంటివి ఉన్నాయని, వీటికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల ఎకో టూరిజం వెనుకబడుతున్నదని చెప్పారు. రామ్‌దేవ్‌రావు 150 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల జాతుల మొక్కలను 85 దేశాల నుంచి తీసుకొచ్చి ఎక్స్‌పీరియంను అద్భుతంగా తయారుచేశారని, ఇది వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా అవతరిస్తుందని చెప్పారు.
ఎక్స్పీరియం పార్క్‌ను తీర్చిదిద్దిను తీరు చూస్తేంటే రామ్‌దేవ్‌రావు వ్యాపారవేత్త మాత్రమే కాదని గొప్ప కళాకారుడనే భావన కలుగుతున్నదని నటుడు చిరంజీవి కొనియాడారు. ఎంతో కళా హృదయం లేకపోతే పాతికేండ్లపాటు శ్రమకోర్చి ఇంతటి అద్భుతాన్ని సృష్టించడం సాధ్యం కాదని ప్రశంసించారు. విదేశాల్లో లభించే మొక్కలను ఇప్పుడు హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి నుంచి వచ్చే రోడ్డును నాలుగైలైన్ల రోడ్డు (ఎక్స్ పీరియం ముందు రోడ్డు)గా అభివృద్ధి చేయాలని సీఎంను కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పంచాయతీ అధికారి సురేష్‌మోహన్, చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
రైతులు వరి పండించడమే కాదు ఎక్స్పీరియంలో ఏర్పాటుచేసిన మొక్కలను పెంచేలా చేయాలనుకుంటున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులు మొక్కలు పెంచేందుకు క్షేత్రాలు ఇస్తున్నామని, ఆయా మొక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రైతులు ఆరు నెలలే మొక్కలు పెంచడం వల్ల అవి 20 నుంచి 30 శాతానికి మించి బతకడం లేదని చెప్పారు. రెండు నుంచి మూడేండ్లు నిండే వరకు మొక్కలు పెంచితే, వాటిని తీసుకెళ్లి నాటితే ఎక్కువగా బతుకుతాయని చెప్పారు.
దీనిపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధివిధానాలపై చర్చించి, సవరించి ప్రకృతి పరిరక్షణ కోసం పాటుపడుతామని హామీ ఇచ్చారు. తల్లి పేరు మీద ఒక మొక్కను నాటి, దానిని పరిరక్షించాలనే విధానాన్ని తీసుకొస్తామని, త్వరలో విదివిధానాలు తీసుకొస్తామని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ ఎక్స్పీరియం ఎక్స్పీరియం హైదరాబాద్‌కు మణిహారంగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.