హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): చారిత్రక నేపథ్యమున్న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్‌క్లబ్‌ను ఉద్దేశించి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జగ్గారెడ్డి మంగళవారం కల్లు కంపౌండ్‌తో పోల్చగా, సీఎం రేవంత్‌రెడ్డి క్లబ్బు.. పబ్బు అంటూ బుధవారం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరి వ్యాఖ్యలపై జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు మండిపడుతున్నారు. అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రెస్‌క్లబ్‌ను ఉద్దేశించి ‘క్లబ్బు, పబ్బులు మాకు అలవాటు లేదు’ అంటూ పరుషంగా మాట్లాడారు.
జర్నలిస్టులు లేని సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జగ్గారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌క్లబ్‌ను ఉద్దేశించి పరుషంగా మాట్లాడటం గర్హనీయమని ఓ సీనియర్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు. జాతీయస్థాయిలో ప్రెస్‌క్లబ్‌కు గొప్ప చరిత్ర ఉన్నది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోనూ ప్రెస్‌క్లబ్‌లు ఉన్నాయి. జాతీయంగా గల ప్రెస్‌క్లబ్‌ల సరసన మన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ చేరింది. ప్రెస్‌క్లబ్‌లు అంటే తాగుబోతుల క్లబ్‌లు కావు. జర్నలిస్టులను సామాన్యులు సులభంగా కలుసుకునే వేదికలు. లోతైన చర్చలకు, మీట్ ది ప్రెస్‌లు, ప్రెస్మీట్లు జరిగే స్థలాలు.
హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా అనేక జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. హెల్త్‌క్యాంపులు, రక్తదాన శిబిరాలను నిర్వహించిన గొప్ప చరిత్ర ఉన్నది. బతుకమ్మ సహా అన్ని మతాల పండుగలను నిర్వహించడం.. ప్రతిభావంతులైన జర్నలిస్టులకు ఆర్థికసాయం చేసిన దాఖలాలు ఉన్నాయి. మొత్తంగా జర్నలిస్టులు కుటుంబాలతోపాటు గడిపే విడిది కేంద్రమిది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుల ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటిది. ఎందరెందరో బాధితులకు, జర్నలిస్టులకు ఈ క్లబ్బు ద్వారా సహాయం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
రాష్ట్రంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తమ గోడును వెల్లబోసుకునేది ఈ ప్రెస్‌క్లబ్‌లోనే. గోస చెప్పుకునేది ఈ వేదికపైనే. ఆఫీసులు లేని వారు. అత్యంత తక్కువ ఖర్చుతో ఇక్కడ మీడియాను సులభంగా కలుసుకుని తమ వాదనలు వినిపిస్తుంటారు. రోజుకు ఐదారు ప్రెస్మీట్లు ఇక్కడ జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రుల వరకు అంతా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వేదిక ద్వారా ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన వారే.
రేవంత్‌రెడ్డి కూడా పలుమార్లు ఇదే వేదికపై ‘మీట్ ది ప్రెస్’కు హాజరయ్యారు. ‘ప్రెస్‌క్లబ్‌ను జల్సాలు చేసుకునే క్లబ్ అన్నట్టుగా సీఎం ప్రస్తుతం చిత్రీకరించారు. తాగుబోతుల అడ్డా అన్నట్టుగా తూలనాడారు. జర్నలిస్టులను తాగుబోతులన్నట్టు అవమానించడం అత్యంత బాధాకరమని ఓ సీనియర్ జర్నలిస్టు ఆవేదన వ్యక్తంచేశారు. పేకాట క్లబ్‌లు అన్న రీతిలో సీఎం వ్యాఖ్యానించారు. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి, తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌క్లబ్‌ను ఉద్దేశించి నీచంగా మాట్లాడారు. కాంగ్రెస్ పాలకులకు జర్నలిస్టులు అన్నా, జర్నలిజం అన్నా విలువేలేకుండా పోయిందని మరో జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తంచేశారు.
2022 జూన్ 15న నాడు ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు-పరిరక్షణ’ అనే అంశంపై ఇదే సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఆల్‌పార్టీ మీటింగ్‌లో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. 2020 నవంబర్ 23న మరో ప్రెస్మీట్లో, 2017 మే 30న నిర్వహించిన ఇంకో ప్రెస్మీట్లో ప్రస్తుతం సీఎం, నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ నేతగా సీఎం రేవంత్‌రెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అదే ప్రెస్‌క్లబ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ‘పబ్బు.. క్లబ్బు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు స్పందించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ వేదికగా చర్చకు రావాలని ప్రతిసవాల్ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించని సీఎం.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రాకుండా ఢిల్లీకి వెళ్లారు. తాజాగా బుధవారం కేటీఆర్ ప్రతి సవాల్‌పై స్పందించారు. ‘మేం క్లబ్బులకు పబ్బులకు దూరం’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు జర్నలిస్టు వర్గాల్లో తీవ్రదుమారం రేపుతున్నాయి. ‘సీఎం రేవంత్‌రెడ్డీ.. మీరు ప్రతిపక్షంలో ఉండగా ఈ ప్రెస్‌క్లబ్.. క్లబ్బు, పబ్బు అని గుర్తులేదా?’ అని జర్నలిస్టు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉండగా ప్రెస్క్లబ్గా కనిపించి.. ఇప్పుడు అధికారంలోకి రాగానే క్లబ్బు, పబ్బుగా కనిపిస్తున్నదా? అంటూ ద్వజమెత్తుతున్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ను కల్లు కాంపౌండ్‌తో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై జర్నలిస్టు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. ఓ ఆంధ్రా మీడియా చానల్‌పై దాడి జరిగితే స్పందించిన రాజకీయ నేతలు.. జర్నలిస్టులకు కేంద్రమైన ప్రెస్‌క్లబ్‌ను సీఎం, మాజీ ఎమ్మెల్యే అవమానిస్తే ఎందుకు స్పందించడం లేదని జర్నలిస్టు సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి నాలుగోస్తంభమైన మీడియాకు సంబంధించిన ఒక వేదికను ఉద్దేశించి సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మాజీ ఎమ్మెల్యే కల్లు కంపౌండ్‌తో పోల్చడం బాధాకరం. ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఉపశమనం కలిగించే వేదిక ఇది. అనేక మంది జర్నలిస్టులు కుటుంబాలతోపాటు వేడుకలు చేసుకుంటారు. ప్రజా సమస్యలను చెప్పుకునే వేదికను అవమానించడం గర్హనీయం.
– ఆస్కాని మారుతీసాగర్, టీయూడబ్ల్యూజే రాష్ట్రప్రధాన కార్యదర్శి