CM Revanth Reddy | కరీంనగర్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వేములవాడలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోమారు రాజకీయ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు కేటీఆర్, హరీశ్‌రావు అడ్డుకుంటున్నారని, అందుకు మూల్యం చెల్లించకతప్పదని పేర్కొన్నారు. కేటీఆర్ జైల్లో పెడతమని అన్నారు. వేములవాడ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్‌రెడ్డి, రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సభకు హాజరయ్యారు. 37 నిమిషాలపాటు కొనసాగిన సీఎం ప్రసంగం మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలకే సరిపోయింది. లగచర్లలో నాలుగు గ్రామాల్లో కలిపి 1100 ఎకరాలు సేకరిస్తుంటే అదో ప్రపంచ సమస్య అయినట్టు బీఆర్ఎస్ చెప్తున్నదని విమర్శించారు. చంద్రమండలానికి పోయి ఫిర్యాదు చేసినా జైలు తప్పదంటూ కేటీఆర్, హరీశ్‌రావుపై తనకున్న కోపాన్ని వెళ్లగక్కారు. రంగనాయక సాగర్ గురించి ప్రస్తావిస్తూ హరీశ్‌రావుపైనా పలు విమర్శలు చేస్తూ బెదిరించే ప్రయత్నం చేశారు. గత పదేండ్లలో 1.83 లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదని విమర్శించిన సీఎం.. ఆ ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి మర్చిపోయారు. ఆ ప్రాజెక్టు నుంచి ఈ సీజన్లో నెల రోజులకుపైగా నీటిని ఎత్తిపోసి మధ్యమానేరు నుంచి అనంతగిరి, కొండపోచమ్మ తరలించి పంటలకు నీళ్లించిన విషయాన్ని మర్చిపోయారు.