హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పెద్దన్నగా పిలువడంలో తప్పేం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ముందుగా ‘మోదీ మా పెద్దన్న’, ‘గుజరాత్ తరహాలో తెలంగాణ అభివృద్ధి’ అని మంగళవారం చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ప్రధాని స్థానంలో ఉన్నవారు పెద్దన్న తరహా పాత్ర పోషిస్తారని, అమెరికాను ఇతర దేశాలు బిగ్ బ్రదర్ అని పిలుస్తాయని చెప్పుకొచ్చారు.
గుజరాత్‌కు మోదీ అనేక ప్రాజెక్టులు మంజూరు చేశారని, ఇదే తరహాలో తెలంగాణకు కూడా మంజూరు చేయాలని కోరానంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, జాతీయ కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందన్న ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీజేపీ నేతలు ఆయనను తప్పుదోవ పట్టించారన్నారు. బీజేపీపై పెద్దగా విమర్శలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించగా.. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదని, అందుకే విమర్శించడం లేదని చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యేనంటూ సీఎం సహా కాంగ్రెస్ నేతలు పదే పదే వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నెల 7 లేదా 8 తేదీల్లో కాంగ్రెస్ ఎన్నికల సంఘం సమావేశం ఉన్నదని ఆరోజు తొలిజాబితా ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరూ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అదానీని ఓవైపు రాహుల్‌గాంధీ వ్యతిరేకిస్తుంటే.. మరోవైపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
అదానీకి రాష్ర్టానికి చెందిన ఎలాంటి ప్రాజెక్టులు అప్పగించలేదని, ఆయనే సొంత డబ్బులు పెట్టుబడిగా పెడుతుంటే తప్పేమిటన్నారు. పెట్టుబడులతో మోదీ, అమిత్‌షా వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని డిమాండ్ చేసి, ఇప్పుడు ఎల్ఆర్ఎస్కు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించగా.. అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తామంటూ సమాధానం దాటవేశారు.
ఎన్డీఎస్ఏకు నాలుగు నెలలు ఎందుకు?
మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, మిగతా బరాజ్‌ల పటిష్టతను సాంకేతికంగా పరిశీలించాల్సి ఉన్నదని, అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)ని ఆశ్రయించామని సీఎం చెప్పారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ఇంజినీర్లలో 99 శాతం మంది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములై మునిగితేలారని, వారితోనే విచారణ చేయిస్తే ‘దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు’ అవుతుందని ఆరోపించారు. అందుకే కేంద్ర సంస్థకు లేఖ రాశామన్నారు.
గత నెల 13న తాము లేఖ రాస్తే, రెండు రోజుల కిందట కమిటీ వేశారని, నివేదిక ఇవ్వడానికి నాలుగు నెలలు పడుతుందని చెప్పారని అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకొని లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందాలు కుదిరేందుకే ఇంత సమయం తీసుకుంటున్నారంటూ అనుమానం వ్యక్తం చేశారు.
ఈ లెక్కన ఎన్డీఎస్ఏను కూడా నమ్మడం లేదా? అని ప్రశ్నిస్తే అదేమీలేదంటూ మాటమార్చేశారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో నీళ్లు నింపి ఎత్తిపోయాలన్న డిమాండ్లను కొట్టిపారేశారు. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాతే మేడిగడ్డపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే తుమ్మడి హట్టి దగ్గర బరాజ్ నిర్మాణం మాత్రం ఆగదని, కట్టి తీరుతామన్నారు. అక్కడి నుంచి ఆదిలాబాద్‌కు సాగునీరు అందిస్తామని చెప్పారు.
డబుల్ డిజిట్ ఖాయం
పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి.. మంగళవారం డబుల్ డిజిట్ సాధిస్తామని వ్యాఖ్యానించారు. అంటే 10 సీట్లు లేదా అంతకుమించి వస్తాయన్నమాట. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు తనను కలువడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని, పార్టీలో చేరాలనుకుంటే తనను గాంధీభవన్‌లో కలిసేవారని స్పష్టం చేశారు. రైతులకు పెట్టుబడి సాయంపై నియంత్రణ విధిస్తామని చెప్పారు.
పన్ను కట్టేవారికి సాయం ఎందుకని ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతులకు, రైతు కూలీలకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి, అఖిలపక్షంతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో పన్నురాబడిని గాడిన పెడుతున్నామని, ఇసుక, జీఎస్టీ ఆదాయం పెరిగిందన్నారు. ప్రస్తుతం కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ, గొర్రెల పంపిణీపై ఏసీబీ విచారణ కొనసాగుతున్నదని, త్వరలో మిగతా విభాగాలపైనా దర్యాప్తు జరుపుతామన్నారు.
హైకమాండ్ అసంతృప్తి?
సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని పెద్దన్న అని పిలువడంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత ఫోన్ చేసి ఇదే విషయాన్ని రేవంత్‌రెడ్డికి వివరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే హడావుడిగా మీడియా ప్రతినిధులను పిలిచి చిట్‌చాట్ పేరుతో తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారని చెప్పుకుంటున్నారు.
చిట్‌చాట్‌కు ఫోన్లు, పెన్నులు నిషేధం
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నిర్వహించిన చిట్‌చాట్‌కు ఫోన్లతోపాటు కనీసం పెన్నులను కూడా అనుమతించలేదు. సెక్యూరిటీ చెకింగ్ వద్దే వాటిని స్వాధీనం చేయాల్సిందిగా పోలీసులు సూచించారు. సమావేశ గదిలో కొత్త పెన్నులు ఇచ్చారు. దీంతో జర్నలిస్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పెన్నులపై కూడా నిషేధం విధిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇది తమను అవమానించడమేనంటూ మండిపడ్డారు. దీంతో సీఎంవో అధికారులు స్పందించి పెన్నులను తిరిగి తెప్పించి, జర్నలిస్టులకు అందజేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ చేసినప్పుడు కొందరు రికార్డ్ చేశారని, అందుకే మొబైల్స్ అనుమతించలేదని, పెన్నులపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేవని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.