కేసీఆర్ గారిని చూస్తే బాధేస్తున్నది. చాలా విజన్ ఉన్న నాయకుడు. ఏదైనా తలచుకుంటే చేయగలిగిన నాయకుడు. వద్దనుకుంటే చేయలేదు. అన్ని వాగ్దానాలు ఇలాగే నెరవేర్చలేకపోయారు. మూడెకరాల భూమి, డబుల్బెడ్రూం. ఇంటికో ఉద్యోగం వంటి హామీలు నెరవేర్చలేకపోయారు.
సీపీఐ కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా మాట్లాడటం సంతోషం. మీరు కలిసే పోటీచేశారు. ఇలా మాట్లాడటంలో తప్పులేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని మేమెక్కడా చెప్పలేదు. మా మ్యానిఫెస్టోలో ఉందా? ఐ ఛాలెంజ్. ఎవరన్నా, ఎక్కడన్నా స్పీచ్‌లో మాట్లాడినట్టు, మ్యానిఫోస్టోలో పొందుపరిచినట్టు ఉంటే చూపించండి. అనవసరంగా స్వీపింగ్ రిమార్క్స్ చేయవద్దు. ఎన్నికల్లో మాట్లాడితే మాట్లాడొచ్చు కానీ, ఇలా సభలో మాట్లాడం. మేం చెప్పనిదానిని చెప్పినట్టు చెప్పడం మీ వయసుకు తగదు.
గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్‌పార్టీ. సింగింల్ విండో డైరెక్టర్‌గా పోటీచేసే అవకాశమిస్తే నిలబడి ఓడిపోయిందే కేసీఆర్. గత పాలనలో ఎంపీగా గెలిపించిందే కాంగ్రెస్. షిప్పింగ్..కార్మికశాఖ మంత్రిని చేసిందే కాంగ్రెస్ పార్టీ.
మేం ఏదో పదవుల కోసం పాకులాడినం అన్నట్టు సీఎం మాట్లాడడం సరికాదు. ఆ విషయానికి వస్తే రేవంత్‌రెడ్డి ఏబీవీపీలో షురువైండు.. టీఆర్ఎస్లో పని చేసిండు, తెలుగుదేశంలో పోయిండు, కాంగ్రెస్‌లో పోయిండు. మరి రేపు ఏడ ఉంటడో? పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి. మాకు అట్లాంటిది ఏం లేదు.
పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా చేసిననాడు నాయిని నర్సింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్చార్జి మంత్రి. ఆ ఆరోజు పోతిరెడ్డిపాడు మీద కొట్లాడింది పీ జనార్దన్‌రెడ్డిగారు. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దదిచేసినప్పుడు ఈ సభలో ఎవరెక్కడున్నరో అందరికీ తెలుసు. ప్రాణత్యాగాలు చేస్తామని ఎవరూ కొట్లాడలే. ఎవరూ ముందుకురాలే. సొంత పార్టీ ప్రభుత్వమున్నా.. తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలగొద్దని, కృష్ణానది జలాల్లో మా వాటా మాకు దక్కాల్సిందేనని, మేం ఒప్పుకోమని కొట్లాడిందే ఆ నాటి నాయకుడు పీజేఆర్. అంతే తప్ప వీళ్లు కాదు.
పోతిరెడ్డి ప్రాజెక్టుపై వీలైతే చర్చ పెట్టండి. సభ రికార్డులు బయట పెట్టండి. వీడియో ఫుటేజీ కూడా సభలో ఉంటది. అది కూడా బయట పెట్టండి. అన్ని విషయాలు బయట పెడితే దాని మీద నేను చర్చకు సిద్ధం. ఇదే సభలో అదే పోడియంలో నేను పద్మారావుగౌడ్ కలిసి పోతిరెడ్డిపాడును ఆపాలని 45 రోజులు నిరసన వ్యక్తం చేశాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు పీజేఆర్ మాత్రమే కొట్లాడారు. ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెదవులు మూసుకుని ఇక్కడ కూర్చున్నారు. ఆ రోజు మాతో గొంతు కలిపింది పీజేఆర్ మాత్రమే. ఆ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాతోనే ఉన్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యుడే ఈ సభలో ఉన్నారు. ఆయన్ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి సహకరించిందే కాంగ్రెస్. ఏ పేరు మీరు వినొద్దని కోరుకుంటున్నారో ఆ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో గత ఆర్థికశాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా లేకుండానే మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజశేఖర్‌రెడ్డి గారి నాయకత్వమే దేశానికి బలమైన నాయకత్వమని వారి నాయకత్వంలో పనిచేశారు.
ఆ రోజు రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో ఆరుగురు మంత్రులు ఉన్నాం. 14 నెలలకే రాజీనామా చేశాం. మేం ఆరు కారణాలు చెప్పి రాజీనామాలు చేశాం. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు అక్రమంగా పొకకొట్టి మా తెలంగాణకు దకాల్సిన కృష్ణా జలాలను రాయలసీమకు తరలించడం, తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు మళ్లించే పులిచింతల ప్రాజెక్టును ఆపకపోవడం, జీవో 610 జీవో అమలు చేయడం నిర్లక్ష్యం, మా తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దక్కే విషయంలో మాట తప్పడం, నక్సలైట్లతో చర్చల పేరిట ఫేక్ ఎన్కౌంటర్లు వంటి కారణాలతో రాజీనామా చేశాం.