హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏదైనా రాష్ట్ర పర్యటనకు రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆహ్వానిస్తుంటారు. కొన్నిసార్లు మంత్రులు మాత్రమే స్వాగతం పలుకుతుంటారు. కేంద్రమంత్రులు వస్తే రాష్ట్ర మంత్రులు లేదా అధికారులు వెళ్లి ఆహ్వానిస్తారు. కానీ మంగళవారం రాష్ర్టానికి వచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పనులన్నీ పక్కనపెట్టి మరీ బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి వికారాబాద్‌లో నేవీ రాడార్ స్టేషన్ పనులను ప్రారంభించేందుకు కలిసి వెళ్లారు. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. మంత్రులో, అధికారులో వెళ్తే సరిపోయేదానికి సీఎం స్వయంగా వెళ్లి ఎదుర్కోవడం వెనుక మర్మమేంటనేది సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమైంది. బీజేపీ-కాంగ్రెస్ మధ్య స్నేహబంధానికి ఇది నిదర్శనమని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఈ స్నేహం మర్మమేంటో?
కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదటి నుంచి రాష్ట్ర బీజేపీ నేతలు సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నారనే చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మినహా బీజేపీ నేతలెవరూ పల్లెత్తు మాట కూడా అనకపోవడమే ఇందుకు ఉదాహరణ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి ‘బడే భాయ్’ అని సంబోధించినప్పుడే ఆ స్నేహం బయటపడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హైడ్రా, మూసీ ఆక్రమణల పేరుతో ప్రభుత్వం హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూలగొడుతున్నా 40 మందికి పైగా కార్పొరేటర్లు ఉన్నా బీజేపీ పట్టించుకోని వైనాన్ని లేవనెత్తుతున్నారు.
రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా రేవంత్ సర్కారు తీరును నిలదీయకపోవడానికి కారణం ఈ స్నేహమే అని అభిప్రాయపడుతున్నారు. పైగా ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు హైడ్రాకు మద్దతు పలికారని గుర్తు చేస్తున్నారు. ప్రజలే కాంగ్రెస్ సర్కారు తీరుపై గొంతెత్తుతున్నా బీజేపీ నేతలకు మాత్రం వినిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ముత్యాలమ్మ గుడి విషయంలో బీజేపీ సహజ వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నదనే చర్చ జరుగుతున్నది. ఇలాంటి మతపరమైన అంశాలు తలెత్తినప్పుడు బీజేపీ నేతలు గొంతుచించుకొని వ్యవహరిస్తుంటారని, ఇప్పుడు మాత్రం నామమాత్రంగా స్పందిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి కావాల్సినప్పుడు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్లు ఖరారు కావడం, గంటల తరబడి ఏకాంత చర్చలు సాగించడం వెనుకా ఇదే స్నేహం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.