Paddy Procurement | జనగామ, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ‘జనగామ మార్కెట్ యార్డులో ఇకపై ధాన్యం కొనుగోళ్లు ఉండవు.. పంట ఉత్పత్తులను రైతులు ఇక్కడికి తేవద్దు.. కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోండి’ అంటూ అధికారులు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జనగామలో ధాన్యం కొనుగోళ్లు మళ్లీ బంద్ అయ్యాయి. ‘వ్యవసాయ మార్కెట్లో ధాన్యం రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందాలి.. ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే.. ట్రేడర్లు, వ్యాపారులు ముందుకు రాకుంటే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనండి.. రైతు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకే కొంటాం.. ధర తగ్గించే వారిపై కఠిన చర్యలు ఉంటయ్’.. అని ఉన్నతస్థాయి అధికారుల సమీక్షలో సీఎం చెప్పినా పట్టించుకోకుండా మద్దతు ధరకు కొనేందుకు ట్రేడర్లు నిరాకరిస్తుండడంతో అధికారులు మార్కెట్‌కు నిరవధిక సెలవును ప్రకటించారు.
ఈ-నామ్ ట్రేడింగ్ ద్వారా యార్డులో క్వింటాల్ ధాన్యాన్ని రూ.1530కే కొనుగోలు చేయడంపై ఈ నెల 11న ‘నమస్తే తెలంగాణ’లో ‘రైతుకు దుఃఖం.. దళారులకు రొక్కం’ శీర్షికన రైతులకు అందని మద్దతు ధరపై కథనం ప్రచురితం కాగా అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించాడని మార్కెట్ కార్యదర్శి భాస్కర్‌ను సస్పెండ్ చేసి తక్కువ ధరకు కోట్ చేసిన ముగ్గురు ట్రేడర్లపై చీటింగ్ కేసు నమోదు చేశారు. అదేరోజు సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి అధికారులతో మాట్లాడిన తర్వాత క్వింటాల్ ధాన్యంపై కేవలం రూ.30 పెంచి రూ.1560 చొప్పున కొనుగోలు చేశారు. దీంతో మరోసారి రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో వ్యాపారులు మద్దతు ధరకు ‘మేం కొనం గాక..కొనం’ అంటూ భీష్మించారు.
ధాన్యం రాశులతో 10రోజుల పడిగాపులతో ఆక్రోశం పెరిగి ఉధృతం అవుతున్న నిరసనలను తట్టుకోలేక జిల్లా యంత్రాంగం తేమ శాతాన్ని బట్టి ధర చెల్లింపుపై రైతులకు నచ్చజెప్పి.. అనధికారికంగా వ్యాపారులను ఒప్పించారు. యార్డులో పేరుకుపోయిన దాదాపు 50వేల బస్తాల పాత నిల్వలను బలవంతంగా ఈ నెల 16న క్వింటాలుకు రూ.1,700 నుంచి 1,923కు ట్రేడర్లు కొనుగోలు చేశారు. నిల్వలు పేరుకుపోవడం, తరలింపు పేరిట వరుసగా నాలుగురోజులు అంటే ఈ నెల 20 వరకు యార్డుకు సెలవులు ప్రకటించి కొత్తగా అమ్మకానికి తెచ్చే రైతులను యార్డుకు అనుమతించలేదు.
ఈ నెల 22న (సోమవారం) యార్డులో కొనుగోళ్లను యథావిధిగా ప్రారంభించాల్సి ఉండగా మార్కెట్ అధికారులు మాత్రం కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఖరీదుదారులు సిద్ధంగా లేనందున వ్యవసాయ మార్కెట్‌కు ఎలాంటి వ్యవసాయ ఉత్పత్తులను తేవద్దని కోరారు. పైగా రైతులెవరూ తమ వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధర కంటే తక్కువకు అమ్ముకోరాదని ప్రభుత్వం నిర్ణయించిన దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో యార్డులో కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ పేరిట పత్రికా ప్రకటనల విడుదల చేశారు.
రైతులంతా తమ గ్రామాల్లోని ఐకేపీ, పీఏసీఎస్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు సహా మార్కెట్ యార్డుకు ఆనుకొని ఉన్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వరి ధాన్యం గ్రేడ్-ఏ రకం రూ.2,203, కామన్ రకం రూ.2,183కు మాత్రమే అమ్ముకోవాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ప్రకటించే వరకు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తేవద్దని చెప్పడం చర్చనీయాంశమైంది.
‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి అధికారుల సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్లో ధాన్యం రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందాలని, ట్రేడర్లు, వ్యాపారులు ముందుకు రాకుంటే ప్రభుత్వ రంగ సంస్థల కేంద్రాల ద్వారా కొనాలని ఆదేశించారు. మార్కెటింగ్, రెవెన్యూ, సహకార, పౌరసరఫరాలు వంటి దాదాపు 50మంది జిల్లా అధికారులు యార్డులో పర్యవేక్షణ బాధ్యత చూసినా, ధాన్యం రైతుకు మద్దతు ధర రాకపోగా మొత్తం యార్డునే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ధాన్యం క్వింటాకు మద్దతు ధర రూ.2,200 చెల్లించాల్సిన ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి రూ.1,700 నుంచి 1,923కు తగ్గించి రైతును దగా చేసింది. ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ అంటూ కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు దేవుడెరుగు, అసలు ధరకే రూ.500 చిల్లు పడింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అంగట్లో వేలంపాట ద్వారా వ్యాపారులు నిర్ణయించిన ధరకే తెగనమ్ముకోవాల్సిన దుస్థితిని సృష్టించారు. ఎమ్మెస్పీ క్వింటాలుకు రూ.2,200కంటే తక్కువకు ఎవరూ అమ్మొద్దు అంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులపై మొసలి కన్నీరు కార్చి..ఆదేశించిన తర్వాత మంచి ధరకు అమ్ముకోవచ్చని ఆశపడినా కాంగ్రెస్ పాలనలో మద్దతు ధర మిథ్యే అని తేలింది.