హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇసుక వినియో గం పెరుగుతున్నా, ఖజానాకు రావాల్సిన ఆదాయం మాత్రం రావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సచివాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే అంశంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్స్ కమిషనర్ శశాంక, టీజీ ఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ సుశీల్ కుమార్‌ను నియమించారు. వారంలోపు విధివిధానాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు. రాష్ట్రం లో ఏటా నిర్మాణాలు పెరుగుతున్నా ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆశించినంత ఆదాయం రావడం లేదని, అదే సమయంలో వినియోగదారులు ఎకువ ధరకే కొనుగోలు చేయాల్సి వస్తున్నదని సీఎం తెలిపారు. వినియోగదారులకు తకువ ధరకే ఇసుక లభించేలా చూడటంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమీక్షలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.