నల్లగొండ : కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల అజ్ఞానంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నల్లగొండ జిల్లా వేదికగా సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నదీ జలాల అంశంపై ఎలాంటి అవగాహన లేదని విమర్శించారు.
నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులపై కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీళ్లపై కనీస అవగాహన లేదని విమర్శించారు. ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో నీళ్ల గురించి అడిగిన ప్రశ్నలకు ‘నేను ప్రిపేరయ్యి రాలేదు, రేపు వచ్చి సమాధానం చెప్తా’ అని తప్పించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మరో మంత్రి గురించి చెబుతూ ‘వాటర్‌లో నీళ్లు’ అని మాట్లాడే అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు.
ప్రజల కష్టాలు, సాగునీటి అవసరాలు తెలియని వాళ్లు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి హూంకరిస్తున్నారని, అబద్ధాలు చెప్పి గందరగోళం సృష్టించడం తప్ప వారికి ప్రజలపట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం కేసీఆర్ గర్జిస్తుంటే, దానికి సమాధానం చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తోందని ఆరోపించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం 90 శాతం పనులు పూర్తి చేస్తే.. మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తిచేయలేక ఈ రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. డీపీఆర్ (DPR) పంపడంలో విఫలమవడమే కాకుండా, ప్రాజెక్టుల పరిధిని కుదిస్తూ తెలంగాణ ప్రయోజనాలకు గండికొడుతున్నారని విమర్శించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల రైతాంగానికి కృష్ణా జలాల్లో న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని స్పష్టంచేశారు.
సాగునీటి అంశంపై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం తడబడుతోందని, ప్రజల దృష్టిని మళ్లించడానికి బెదిరింపులకు దిగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ భయపడదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.