హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిసారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తు ఉత్పత్తికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్తు శాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. డాటా సెంటర్లు, మెట్రో విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ విద్యుత్తు అవసరాలను అంచనావేసి, రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
మూడేండ్ల కాలానికి విద్యుత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గత సంవత్సరంతో పోల్చితే విద్యుత్తు డిమాండ్ 9.8% పెరిగిందని, ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. 2025-26లో 18,138, 2034-35లో 31,808 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఓఆర్ఆర్- ట్రిపుల్ ఆర్ మధ్య ఏర్పాటయ్యే శాటిలైట్ టౌన్షిప్లకు విద్యుత్తును అందించే విషయంలో హెచ్ఎండీఏ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్తు లైన్లను ఏర్పాటుచేయాలని, గ్రేటర్ హైదరాబాద్‌లో స్మార్ట్‌పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సీఎండీలు కృష్ణభాస్కర్, ముషారఫ్ అలీ, వరుణ్‌రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
వానకాలం పంటల సాగుకు సన్నద్ధంగా ఉండాలని వ్యవసాయశాఖ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణానికి సరిపడేలా విత్తనాలు, ఎరువులు అందుబాటులు ఉంచాలని సూచించారు. నకిలీ విత్తనాలు, రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉకుపాదం మోపాలని, కల్తీ, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.