రూ.13,527 కోట్ల రీఫైనాన్స్‌కు ఐఆర్ఎఫ్సీతో ఒప్పందం కుదిరింది. అంతా సంతకాలు చేశారు. ఎల్అండ్టీ ఖాతాకు రూ.1400 కోట్లు ఈక్విటీ షేర్ జమ చేసినం. లోన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.84 కోట్లు కట్టినం. ఒక సింగిల్ క్లిక్‌తో రూ.13,527 కోట్లు మా చేతికి వచ్చేది. సరిగ్గా ఇదే సమయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెళ్లి రుణం ఆపేసిండు!
– ఇటీవల సచివాలయంలో మీడియాతో సీఎం రేవంత్
‘కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నివాసంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ -1 వాల్యూయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణసేకరణ, రుణసంస్థ ఎంపిక, ఫేజ్-2 విస్తరణ, నిర్మాణ వ్యయం తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించాలని కేంద్రమంత్రులు, సీఎం ఏకాభిప్రాయానికి వచ్చారు. కన్సల్టెంట్‌గా ఎస్బీఐ క్యాప్స్‌ను వారు ఎంపిక చేశారు’
– మంగళవారం తెలంగాణ సీఎంవో విడుదల చేసిన పత్రికా ప్రకటన
వారం రోజుల్లో 2 విరుద్ధ ప్రకటనలు!హైదరాబాద్ మాట.. ఢిల్లీలో మార్పు! దీని భావమేమి తిరుమలేశా?
‘ఆవులు, ఆవులు కొట్లాడి దూడల కాళ్లు విరగ్గొట్టినట్టు’ అయ్యింది హైదరాబాద్ మెట్రో పరిస్థితి. కేసీఆర్ క్రెడిట్‌ను చోరీ చేసే వ్యవహారంలో ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అని సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. చివరికి మెట్రో రైలునే ఆగం చేసేకాడికి తీసుకొచ్చారు. ఇద్దరూ కలిసి ఢిల్లీదాక పోయి, మూడు రోజులు హడావుడి చేసి, సాధించిందేంది? కేంద్రమంత్రులతో గంటలకు గంటలు చర్చలు జరిపి మెట్రోకు ఒరగబెట్టింది ఏంది? అని పరిశీలిస్తే.. మెట్రో రెండోదశ విస్తరణ సంగతి దేవుడెరుగు, మొదటి దశకే మోసం వచ్చింది. ఇప్పటికే అంపశయ్య మీదున్న ఫేజ్-1 భవిష్యత్తు ఏమిటో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అర్థిక నష్టాలతో కునారిల్లుతున్న మెట్రోను రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి కలిసి మరింత లోతు ఊబిలోకి తోసేశారు.
హైదరాబాద్ జూన్ 23 (నమస్తే తెలంగాణ): మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. మెట్రో రుణం రీ ఫైనాన్స్ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి ఇన్నాళ్లూ చేసిన హడావిడిని తుస్సుమనిపించింది. కొన్ని రోజులుగా హైదరాబాద్ మెట్రో తొలిదశ స్వాధీనం, ఐఆర్ఎఫ్సీ రుణం వ్యవహారం, రెండో దశ మెట్రో విస్తరణకు సంబంధించి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్య వెల్లువెత్తిన విమర్శలు, లేఖల యుద్ధానికి దాదాపు ముగింపు పలికింది. అల్లరి చేసే పిల్లవాడి నెత్తిన రెండు మొట్టికాయ లు వేసి, బుద్ధులు చెప్పి పంపినట్టుగా సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర ప్రభుత్వం తిరిగి హైదరాబాద్‌కు పంపించింది. ఐఆర్ఎఫ్సీ (ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్) రుణంపై చర్చించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. సోమవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీకాగా, మంగళవారం కేంద్ర గృ హ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. రూ.13, 527 కోట్ల ఐఆర్ఎఫ్సీ రుణం, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై ఖట్టర్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఇద్దరి మధ్య ఇదీ పంచాయితీ
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రీ ఫైనాన్సింగ్ కింద రూ.13,527 కోట్ల రుణం ఇచ్చేలా ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్, హెచ్ఎమ్ఆర్ఎల్ మధ్య మే 25న ఒప్పందం కుదిరింది. ఈ మేరకు తెలంగాణ సీఎంవో, ఐఆర్ఎఫ్సీ కార్యాలయాలు పత్రికా ప్రకటనలు విడుదల చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.1,400 కోట్లు ఎల్ అండ్ టీకి, ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.84 కోట్లు, ఐఆర్ఎఫ్సీ రుణం, వ్యాల్యూయేషన్ ఫీజు, ఇతరత్రా అవసరాలకుగాను ట్రాన్సాక్షనల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్న ఐడీబీఐ క్యాపిటల్‌కు రూ.174 కోట్లు చెల్లించింది. రుణం చేతికి అందుతుందని అనుకున్న సమయంలో బ్రేక్ పడింది. రుణం వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో సీఎం మీడియా ముందుకు వచ్చి కిషన్‌రెడ్డిని టార్గెట్ చేశారు. దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మైలేజ్ రాకూడదనే ఉద్దేశంతోనే కిషన్‌రెడ్డి తన తోటి క్యాబినెట్ మంత్రులపై ఒత్తిడి తెచ్చి రుణం రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. జైకా నుంచి ఐఆర్ఎఫ్సీకి అందిన నిధులను రాష్ట్రానికి బదిలీ చేయకుండా కిషన్‌రెడ్డి తొకిపెట్టారని వ్యాఖ్యానించారు. దీనిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ తన వల్ల తెలంగాణకు రావాల్సిన ఏ ప్రాజెక్టు కూడా ఆగిపోలేదని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య లేఖల యుద్ధం నడిచింది. ఒకరి నొకరు కౌంటర్, ఎన్కౌంటర్ చేసుకున్నారు. చివరికి ఇద్దరి పంచాయితీ ఢిల్లీకి చేరింది.
మమ్మల్నే కాదంటారా?
ఐఆర్ఎఫ్సీ రుణం, మెట్రోరైలు రెండో విడత విస్తరణపై చర్చించేందుకంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. ఆయన అభ్యర్థన మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తన పలుకుబడి ఉపయోగించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. వీరి మధ్య రెండు రోజుల్లో గంటల పాటు చర్చలు జరిగాయి. ఇద్దరు కేంద్ర మంత్రులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన రూ.13,527 కోట్ల రుణం మీద చర్చలే జరుగలేదని సమాచారం. ఐఆర్ఎఫ్సీ రుణం మీద సీఎం రేవంత్‌రెడ్డి నెల రోజులుగా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తక్కువ వడ్డీకే రూ.13,527 కోట్ల రుణం తెచ్చానని, దాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి అడ్డుకున్నారని ఆరోపించారు. అయితే.. ఢిల్లీలో రుణం ప్రస్తావన వచ్చినప్పుడు కేంద్ర మంత్రి ఖట్టర్ సీఎం రేవంత్‌రెడ్డిని గట్టిగానే అరుసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మెట్రో మొదటి దశలో కేంద్ర ప్రభుత్వానికి 10 శాతం వాటా ఉన్నదని గుర్తు చేశారట. వాటాదారులమైన తమను విస్మరించి, ఒక్కరే రుణానికి ఎలా వెళ్తారని నిలదీసినట్టు సమాచారం. ఇది చట్టం ముందు నిలబడుతుందా? అని ప్రశ్నించినట్టు తెలిసింది. ‘డీపీఆర్‌లు సరిగా పంపరు, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారు’ అని అసహనం వ్యక్తం చేస్తూ, ఒక్క చోట కూడా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా కిషన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని రేవంత్‌ను ఖట్టర్ నిలదీసినట్టు తెలిసింది. దీంతో సీఎం సైలెంటైనట్టు సమాచారం.
కన్సల్టెంట్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మెట్రోరైలు ఫేజ్-1 వ్యాల్యూయేషన్, స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపికతోపాటు, మెట్రో ఫేజ్-2 విస్తరణ, నిర్మాణ వ్యయం, రుణ సేకరణ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించాలని కేంద్ర మంత్రు లు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకరించారు. కన్సల్టెంట్‌గా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘ఎస్బీఐ క్యాప్స్’ వ్యవహరిస్తుందని కేంద్రమంత్రులు, సీఎం ప్రకటించారు. కన్సల్టెంట్ సమన్వయ సభ్యులుగా కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాల తరఫున స్పెషల్ సెక్రటరీలు ఉండాలని నిర్ణయించారు. మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ ఎంత? దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా టేకోవర్ చేసుకోవాలి? ఐఆర్ఎఫ్సీ నుంచి తకువ వడ్డీకే రుణాన్ని ఎలా పొందాలి? అనే అంశాల మీద ఎస్బీఐ క్యాప్స్ అధ్యయనం చేసి, సమగ్ర నివేదిక అందించనున్నది. ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ మెట్రో రుణం, నిధుల విడుదలకు ఆమోదంపై తుది నిర్ణ యం తీసుకుంటుందని తెలిసింది. దీంతో మెట్రో మొ దటి దశ స్వాధీన ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.
అంధకారంలో మెట్రో భవితవ్యం
సీఎం రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల మెట్రోరైలు భవితవ్యమే అంధకారంలో పడిందని విశ్లేషకులు మండిపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ వల్ల ఇప్పటికే రోజుకు రూ 2.50 కోట్ల నష్టం వస్తున్నదని అంచనా. ఇప్పటివరకు ఈ నష్టాన్ని నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ భరించింది. జూన్ 1 నాటికి ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర క్యాబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ షేర్ కింద రూ.1,400 కోట్లు ఎల్ అండ్ టీ అకౌంట్‌కు జమ చేసింది. కానీ అనుకున్న విధంగా రుణం అందకపోవడంతో ఎక్కడి లావాదేవీలు అక్కడే ఆగిపోయాయి. దీంతో ప్రతిరోజూ మెట్రో నిర్వహణతో వచ్చే రూ 2.50 కోట్ల నష్టం ఎవరు భరిస్తారనే ప్రశ్న మొదలైంది. తాము ఇప్పటికే సంస్థను సూచనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేశామని, వచ్చే నష్టాలను ప్రభుత్వమే భరించాలని ఎల్ అండ్ టీ తేల్చి చెప్పినట్టు సమాచారం. మొత్తంగా రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి కలిసి మెట్రోరైలు మొదటి దశను దెబ్బతీశారని, హడావిడిగా ఢిల్లీకి వెళ్లిన సీఎం.. ఉత్తచేతులతో వచ్చారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో పని కాకపోవడంతో ఆయన తీవ్ర అసహనం తో ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి సీఎం మంగళవారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించాలని భావించారట. కానీ చెప్పుకోవడానికి ఏమీ లేక నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు.
వాటాల కోసం గొడవ?
మెట్రో తొలిదశ ప్రాజెక్టులో కేంద్రానికి ఉన్న 10 శాతం వాటా మీదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం తలెత్తినట్టు సమాచారం. ప్రస్తుతం మెట్రో దగ్గర 200 ఎకరాలకుపైగా భూములున్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.30 వేల కోట్లు ఉంటుందని అంచనా. వీటిపై కేంద్రం కూడా కన్నేసిందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే తాము మెట్రో రైల్లో 10 శాతం వాటాదారులమని, మెట్రో ఆస్తుల్లో 10 శాతం తమకు కూడా చెందుతుందని సీఎంకు కేంద్ర మంత్రి ఖట్టర్ తేల్చి చెప్పినట్టు సమాచారం. 10 శాతం వాటాదారులమైన తమను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో రుణాల కోసం ఎలా వెళ్తారని అడిగినట్టు తెలిసింది.
ఎస్బీఐ అంతు తేలుస్తా అని వెళ్లి..
ఎస్బీఐ అంతు తేలుస్తామని, సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం తెగతెంపులు చేసుకుంటుందని హడావుడి చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చివరికి అదే సంస్థతో ఒప్పందం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో ఉన్న ఐదు ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వేలం వేసిన సంగతి తెలిసిందే. ఈ భూమి తమదేనని పేర్కొంటూ, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎస్బీఐ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బ్యాంకు తనను కాదని కోర్టుకు వెళ్లిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో తెగతెంపులు చేసుకుంటుందని అనుకూల మీడియా ద్వారా కథనాలు ప్రసారం చేశారు. లీడ్ బ్యాంకు హోదాను రద్దు చేస్తామని ప్రచారం చేశారు. తెలంగాణవాసి అయిన ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి, స్థానిక రాజకీయాల ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత ప్రధాన మంత్రికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, ఆర్బీఐ గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని లీకులిచ్చారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత సీన్ రివర్స్ అయింది. కేంద్ర ప్రభుత్వం రేవంత్‌రెడ్డి భుజాల మీద ఎస్బీఐని కూర్చోబెట్టింది. మొదటి, రెండో దశ మెట్రో కోసం రుణాల సేకరణ, రుణ సంస్థల ఎంపిక తదితర అధికారాలను ఎస్బీఐకే అప్పగిస్తూ కేంద్ర మంత్రులు నిర్ణయం తీసుకొని, దీనికి సీఎం రేవంత్‌రెడ్డిని కూడా ఒప్పించారు.
రూ.258 కోట్ల సంగతేంది?
ఎస్బీఐకి ట్రాన్సాక్షన్స్ కన్సల్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కు వచ్చి పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐడీబీఐ క్యాపిటల్‌ను ట్రాన్సక్షన్ అడ్వైజర్‌గా నియమించింది. ఐఆర్ఎఫ్సీ రుణం, వ్యాల్యూయేషన్ ఫీజు, ఇతరత్రా అవసరాల్లో సంస్థ సహాయం చేస్తున్నది. ఇందుకోసం ఐడీబీఐ క్యాపిటల్ రాష్ట్ర ప్రభుత్వం రూ.174 కోట్లు చెల్లించింది. రుణం ఇస్తామని ఒప్పందం చేసుకున్న ఐఆర్ఎఫ్సీకి ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.84 కోట్లు చెల్లించింది. మొత్తం రూ.258 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు రుణ ప్రక్రియకు బ్రేక్ పడటంతో వీటి సంగతేందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.258 కోట్లు తిరిగి రాబడుతారా? ఎలా రాబడుతారు? అనేవి అంతు చిక్కని ప్రశ్నలుగా మారాయి.