ముంబై, ఆగస్టు 4: బంగారాన్ని వ్యూహాత్మక ఖనిజంగా వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సూచించింది. దేశీయంగా మైనింగ్‌ను ఉత్సాహపర్చేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు ఇది అవసరమని పేర్కొన్నది. గోల్డ్ మైనింగ్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో సంబంధం లేకుండా కేంద్రం నుంచే అనుమతులు వచ్చేలా.. అదికూడా సింగిల్ విండో క్లియరెన్స్ మెకానిజమ్‌ను తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని గనుల మంత్రిత్వ శాఖతో జరిగిన చర్చల్లో డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ అన్నారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో ఆయన పీటీఐకి తెలియజేశారు.
కాగా, ఏడాదిపాటు బంగారాన్ని దేశ ప్రజలు కొనవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమధ్య పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇది.. దేశంలోకి వచ్చే పసిడి దిగుమతుల్ని తగ్గించడానికేనని ప్రభుత్వం చెప్పుకొచ్చిన సంగతీ విదితమే. దేశీయ దిగుమతుల్లో ఇంధనం తర్వాత వాటా పుత్తడిదే మరి. గల్ఫ్ వార్ కారణంగా పెరుగుతున్న ముడి చమురు ధరల దృష్ట్యా.. ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి డాలర్లను అధికంగా చెల్లించాల్సి వస్తుండటంతో.. తగ్గే బంగారం దిగుమతులతో ఆ మిగిలిన డాలర్లను అందుకు ఉపయోగించుకోవచ్చన్నది సర్కార్ యోచన. అయితే దేశంలోనే బంగారం తవ్వకాలు పెరిగితే.. ఈ సమస్య ఉండదని డబ్ల్యూజీసీ అంటున్నది.