హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): జనగణనలో ఓబీసీ గణన అంశంపై చర్చించేందుకు సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని హోటల్ టూరిజం ప్లాజాలో బీసీ జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనగణనలో ఓబీసీ గణనను ప్రత్యేక అంశంగా పేర్కొనకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. తక్షణమే ప్రస్తుత జనగణన ప్రశ్నావళిని రద్దు చేసి నూతన ప్రశ్నావళిని రూపొందించాలని డిమాండ్ చేశారు. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి ప్రతినిధులు హాజరై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.