రాఖీ పండుగ అంటే అందంగా అల్లుకున్న అనుబంధాలకు ప్రతీక. అన్నదమ్ములు-అక్కచెల్లెల అనురాగానికి సూచిక. వాళ్లకు కట్టే రాఖీని అంతే అందంగా అల్లితే ఇంకెంత బాగుంటుంది అన్న ఆలోచన నుంచి పుట్టినవే ‘నిట్టెడ్ రాఖీ’ లేదా ‘క్రోచెట్ రాఖీ’లు. రంగు రంగుల దారాలతో పూసలు కలగలిపి అల్లుతారు వీటిని. రకరకాల డిజైన్లు, పువ్వుల్లా చూడముచ్చటగా కనిపించే వీటి మీద రాళ్లు కుందన్లు కూడా అద్దుతున్నారు.
మన చేత్తో మనమే వీటిని తయారు చేసి అన్న, తమ్ముళ్లకు కడితే ఆ ఆనందమే వేరు. ఆ అవకాశం లేని పక్షంలో ఆన్లైన్లో హ్యాండ్ మేడ్ రాఖీల పేరుతో వెతికితే విభిన్న మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పుడూ కట్టే రాఖీకి కాస్త భిన్నంగా ఉండాలనుకుంటే వీటిని ప్రయత్నించవచ్చు. అల్లికతో వచ్చినవి గట్టిగా ఉండి, చేతికి చాలా రోజుల పాటు నిలిచిపోతాయి కూడా. మరి మీ అనుబంధాన్ని అందమైన అల్లికలతో ముడేస్తారా!