సాధారణంగా రక్షాబంధన్ అనగానే రాఖీలు, మిఠాయిలతో పాటు రాఖీ కట్టిన సోదరికి ఖరీదైన బహుమతులివ్వాలనే అంశాలే గుర్తొస్తాయి. కానీ కొన్నిసార్లు ఒక చిన్న సాయం, కాస్త సమయమే ఎంతో గొప్ప అనుభూతిని ఇస్తాయి. ఈ రక్షాబంధన్ మీ తోబుట్టువులకు ప్రత్యేకంగా నిలిచేందుకు ఇలాంటివి చేయండి..
పనుల్లో సాయం: మీ తోబుట్టువులు రోజూ చేసే పనుల్లో ఏదో ఒకదాన్ని మీరే పూర్తి చేయండి. ఇల్లు సర్దడం, బయటికి వెళ్లి అవసరమైన సామాన్లు తేవడం లేదా ఇంటి పనుల్లో సాయం చేయడం వంటివి వారి శ్రమను తగ్గించి వారి ముఖంలో చిరునవ్వు తెప్పిస్తాయి. దీంతో, వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు.
ఇష్టమైన వంటకం: మీ సోదరికి ఇష్టమైన వంటకం ఏంటో మీకు తెలిసే ఉంటుంది. అందుకే వారికి ఇష్టమైన పదార్థాన్ని మీ చేతులతో వండి పెట్టండి. దీనికి పెద్ద చెఫ్ కావాల్సిన పనిలేదు. వారికి ఇష్టమైన టిఫిన్, భోజనం లేదా స్నాక్స్ ప్రేమతో స్వయంగా చేసి పెట్టండి. మీరు చూపించే ఆ శ్రద్ధే వారికి విలువైన కానుక.
సమయం కేటాయించండి: రోజంతా ఫోన్లలో, బిజీ షెడ్యూల్స్‌తో గడిపే ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ను కాసేపు పకన పెట్టి వారితో కూర్చోండి. మనసు విప్పి మాట్లాడటం, నవ్వుకోవడం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం కంటే గొప్ప కానుక మరొకటి ఉండదు. చిన్నప్పుడు మీరు చేసిన అల్లరి, తీపి జ్ఞాపకాల్ని మీ తోబుట్టువుతో పంచుకోండి.
దూరంగా ఉండే వారికోసం: వేర్వేరు నగరాల్లో లేదా విదేశాల్లో ఉండేవారు కేవలం కొరియర్ పంపడంతో సరిపెట్టకుండా, వీడియో కాల్లో కలిసి వర్చువల్ భోజనం చేయడం లేదా సర్ ప్రైజ్ వీడియో మెసేజ్ పంపడం ద్వారా దూరాన్ని తగ్గించవచ్చు. రక్షాబంధన్ అనేది కేవలం సోదరిని కాపాడతానని సోదరుడు ఇచ్చే హామీ మాత్రమే కాదు.. ఇద్దరి మధ్య ఒకరికొకరు తోడుగా, ఒకరి ఎదుగుదలలో మరొకరు అండగా నిలబడే గొప్ప ఆత్మీయ బంధం.