సిటీ బ్యూరో , ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): మారేడ్పలి : దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఆదివారం టికెట్ తనిఖీ నిర్వహించారు. ఈమేరకు సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల పరిధిలోని 169 రైళ్లను 186 మంది సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారిని గుర్తించడంపై దృష్టిసారించారు. అనధికారికంగా ప్రయాణిస్తున్న వారిని, బుక్ చేయని లగేజీని కలిగి ఉన్న 4,121 మందిని గుర్తించామన్నారు.
రూ.30. 53 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. అదేవిధంగా రైల్వే ప్రాంగణంలో అనుమతి లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న 19 మందిపై చర్యలు తీసుకుని రూ.38 వేల జరిమానా విధించామని తెలిపారు. ధూమపానం చేస్తున్న ఇద్దరు ప్రయాణికులకు రూ.4 వేల జరిమానా విధించామన్నారు. తనిఖీని విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.