హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బెల్ట్‌షాపులను ఎత్తివేసే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సోమ, మంగళవారాల్లో వరుసగా రెండు రోజులపాటు ఎక్సైజ్‌శాఖ అధికారులతో చర్చించిన రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని బెల్ట్‌షాపులపై ఆరా తీసినట్టు సమాచారం.
రాష్ట్రంలో ఎన్ని బెల్ట్‌షాపులు ఉన్నాయి? వాటి ద్వారా వచ్చే ఆదాయం ఎంత? ఎంత మద్యం అమ్ముడవుతున్నది? వాటిని తీసేస్తే లాభనష్టాలు ఏమిటి? అనే కోణంలో అధికారులను వివరాలు అడిగినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో ఎక్సైజ్‌శాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, పలు సంస్కరణలు చేపడతారని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. 786 షాపులను గౌడ, ఎస్సీ, ఎస్టీలకు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. 2024 డిసెంబర్ 1 నుంచి 2025 వరకు కొత్త మద్యం పాలసీ రాష్ట్రంలో అమలవుతున్నది.