హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏడాది పాలన పేరుతో కాంగ్రెస్ నేతలు సంబురాల్లో మునిగి తేలుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు గొప్పలు సాధించామని చెప్పుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో మహిళలు మాత్రం ప్రభుత్వ సంబురాలపై మండిపడుతున్నారు. హామీలు ఏమీ నెరవేర్చకుండా వేడుకలు చేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఏవీ కార్యరూపం దాల్చకపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘రెండు చీరల పంపిణీ’ హామీని కూడా అటకెక్కించిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మూలుగుతున్న ప్రతిపాదనలు
స్వయం సహాయ బృందాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు రెండు చీరల చొప్పున ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో హామీ ఇచ్చారు. రాష్ట్ర చేనేత జౌళిశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు. కానీ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద మూలుగుతున్నాయి. అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఎస్‌హెచ్‌జీ మహిళలు ప్రశ్నిస్తున్నారు.
చీరల పంపిణీకి నిధులు లేవు!
రాష్ట్రంలో ‘రెండు చీరల పథకం’ అమలుకు ప్రభుత్వం మంగళం పాడిందా? కావాలనే తొక్కి పెట్టిందా? అని మహిళల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల్లో దాదాపు 64 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున ఇవ్వాలంటే 1.30 కోట్ల వరకు చీరలు అవసరం. ఒక్కో చీరకు కనీసం రూ.500 ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తం రూ.400కోట్లకు పైగానే బడ్జెట్ అవుతుందని ప్రతిపాదించారు. ఆరు గ్యారెంటీల హామీని అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు చీరల కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తుందని నమ్మడం అత్యాశే అని మహిళా సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. చీరల తయారీ ఆర్డర్లు వస్తే ఉపాధి దొరుకుతుందని భావించిన నేతలు ప్రభుత్వం నుంచి స్పందన లేక ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లతో పని దొరికేదని, ఇప్పుడు ఉపాధి కరువైందని మండిపడుతున్నారు.