హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ప్రజాకవి గద్దర్ జయంతి సభను రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉత్సవంలా నిర్వహించిందని సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో శనివారం బీఆర్ఎస్ నేత సందీప్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమానికి ఒకే వర్గాన్ని పిలిచి.. రాజకీయ లబ్ధి కోసం గద్దర్‌ను ఉద్దరించినట్టు పోజులు కొట్టారని దుయ్యబట్టారు.
గద్దర్ పేరును నాంపల్లి గల్లీకి పెడతామని చెప్పి సీఎం రేవంత్‌రెడ్డి.. ఆటపాటలతో విశ్వవ్యాప్తమైన ఆయన పేరును గల్లీస్థాయికి దిగజార్చారని మండిపడ్డారు. హంతకులే సంతాప సభలు పెట్టిన చందంగా.. నాటి నుంచి నేటి వరకు గద్దర్‌ను అడుగడుగునా అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయనను కిర్తీంచడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నిజంగా సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఆయన పేరిట ప్రజాకవులు, సాహితీవేత్తలకు అవార్డులు ఇవ్వాలని, ఆయన పుట్టిన మెదక్ జిల్లాకు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో గద్దర్‌ను అవమానించారని రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. గద్దర్ కోరిక మేరకు ఆయన సొంతూరులోని చెరువును నింపేందుకు అప్పటి మంత్రి హరీశ్‌రావు 24 గంటల్లో హల్దీ వాగుపై లిఫ్ట్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనతో కలిసి నడించింది, గజ్జెకట్టింది తామేనని వివరించారు. బీఆర్ఎస్ ఆయనను గౌరవిస్తే రేవంత్ సర్కారు ఆయన పేరును మార్కెటింగ్ చేసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతెలంగాణ కోసం తన జీవితాన్ని ధారపోసిన గద్దర్‌పై తుపాకీ ఎక్కుపెట్టింది రేవంత్ గురువు చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.
నంది అవార్డును తిరస్కరించిన ఆయన పేరిట సినిమావాళ్లకు అవార్డులివ్వడం చూస్తుంటే గద్దర్ ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. పసిమనసు కలిగిన ఆయనను కాంగ్రెస్ నేతలు మాయచేసి రాహుల్‌గాంధీ జోడో యాత్రలో, భట్టి విక్రమార్క పాదయాత్రలో నడిపించారని విమర్శించారు. భట్టి పాదయాత్రలో అస్వస్థతకు గురై దవాఖానలో చేరిన గద్దర్ ప్రాణాలు విడిచిన తర్వాతే ఇంటికి చేరారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కూతురు వెన్నెలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడించారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్లో పుట్టిన రేవంత్‌కు గద్దర్ కుటుంబంపై ఉన్న ప్రేమ వట్టిదేనని స్పష్టం చేశారు.